Pages

Wednesday, 30 July 2014



ఆ చిన్నపిల్లల్ని ఎవరు చంపారు? " - కంచ ఐలయ్య
మాసాయిపేట దుర్ఘటనలో పాపం, పుణ్యం తెలియని పసికందులు ఎందుకు చనిపోయారు? నాలుగైదు గ్రామాల నుంచి అంత చిన్న పిల్లలు బస్సుల్లో పట్టణాల్లో స్కూళ్ళకు ఎందుకొస్తున్నారు? యల్‌.కె.జి.లో చేరే చిన్న పిల్లల వయస్సు ఎంత ఉంటుంది -మూడు లేదామూడున్నర కదా? రైలు ట్రాక్‌ చుట్టూ పడివున్న శవాలను, వారి పసి ముఖాలను చూసి ఏ పండిత వర్గమైనా బాధపడిందా?
ఈ చిన్న పిల్లల్ని గ్రామాల నుంచి ఇంగ్లీష్‌ మీడియం స్కూలుకు పంపిన తల్లిదండ్రుల ముఖాలు, బట్టలు చూశారా? అందులో ఎంత బీద లేబర్‌జనం ఉన్నారో గమనించారా? వాళ్ళ, వాళ్ళ గ్రామాల్లో కిండర్‌ గార్టెన్‌ నుంచి ఏడో తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియం ఉండి ఉంటే ఇంత పసికందులు బస్సులో పడి గేటులేని లెవల్‌ క్రాసింగ్‌లు ఉన్న దేశంలో, రాష్ట్రంలో సుదూర స్కూలుకు వెళ్ళేవాళ్ళా? హైదరాబాద్‌కు అతి దగ్గర్లో ఉన్న రైలు లైన్ల మీద కూడా కనీసం మనిషిని పెట్టి గేటు పెట్టలేని రైలుపట్టాలున్న దేశమిది. రైల్వే ఆస్తుల్ని మంత్రులు, అధి కారులు ఎంత దోచుకుతింటున్నారో మనకు తెలుసు. ఈ ప్రాంతం నుంచి ఎంతోకాలం నుంచి ఎన్నో స్కూలు బస్సులు పసికందుల్ని ఎక్కించుకొని తిరుగుతున్నాయని అధికారులకు తెలుసు, మంత్రులకు తెలుసు. ఎంత వీలైతే అంత దోచుకొని పాపభీతి కూడా లేకుండా బతికే పాలకులకు పసిపిల్లల ప్రాణాలు ఎంత విలువైనవో ఎలా తెలు స్తుంది? ఆ చనిపోయిన పిల్ల్లల్లో ఎటువంటి మేధావితనం దాగి ఉండిందో ఎలా అంచనా కట్టగలం? వాళ్ళంతా ఇంత పెద్ద వ్యవస్థ నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం, అమానుషత్వంతో ఆగమైపోతే ఎందుకిలా జరుగుతుందో మూలాల్లోకి పోవాలి గదా! గ్రామాల్లో శ్రమజీవుల్లో ఇంగ్లీషు విద్యా ఆకాంక్ష అంతా ఇంత పెరగలేదు. హైదరాబాద్‌ చుట్టూ గ్రామాల్లో కూలీనాలీ చేసుకునే వాళ్ళు ఇంగ్లీషు విద్య కోసం ఇంత తపించి అంత పసికందుల్ని సుదూరం పొయ్యే బస్సెక్కిస్తుంటే ఎవరు ఆలోచించకపోయినా ప్రభుత్వ స్కూల్‌ టీచర్లు ఆలోచించాలి కదా?
ఈ పిల్లలు పుట్టిన అన్ని గ్రామాల్లో తెలుగు మీడియం స్కూళ్ళు ఉన్నాయి. అందులో ప్రభుత్వ పంతుళ్ళు ఉన్నారు. ఆ స్కూళ్ళలోకి ఈ కూలీ, నాలీ పిల్లల్ని పంపడానికి తల్లిదండ్రులు ఇష్టపడక, బస్సుకూ, స్కూలుకూ తమ రెక్కల కష్టం నుంచి డబ్బుకట్టి ఉచిత విద్యను, మిడ్డే మీల్స్‌ను పక్కకు పెట్టి ప్రైవేట్‌ స్కూళ్ళకు వాళ్ళు ఎందుకు పంపుతున్నారు? ప్రభుత్వ స్కూళ్ళల్లో తెలంగాణ జిల్లాల్లో సగటున 59 మంది పిల్లలే మిగిలి ఉన్నారని టీచర్‌ సంఘాలే ఒప్పుకుంటున్నాయి. ఆ 59 మంది తల్లిదండ్రులు అయ్యో! మా పిల్లలు ఇంగ్లీష్‌ మీడియం స్కూలుకు పోతలేదే అని ప్రతిరోజూ ఆవేదన పడుతున్నారు. ఆ ఆవేదన నుంచే కదా ఈ పసికందులు బలైంది? దానిని తల్లిదండ్రుల తప్పందామా?
ఈ స్థితి ఎందుకొచ్చిందనే ప్రశ్న గురించి ఎవరు ఎక్కువ ఆలోచించాలి? ఉపాధ్యాయ సంఘాలు, టీచర్‌ ఎమ్మెల్సీలు ఈనాడున్న విద్యా వ్యవస్థకు మేలుచేస్తున్నారా, కీడు చేస్తున్నారా? ఒక చిన్న మేధావి వర్గం విప్లవం, మార్క్సిజం, ప్రభుత్వ రంగం, సోషలిజం గురించి ఉపన్యసిస్తూ తమ పిల్లల చదువుకొచ్చే సరికి వరల్డ్‌ క్లాస్‌ ప్రైవేట్‌ స్కూళ్ళకు పంపుతుంటే వీళ్ళు విప్లవ దృక్పథానికి చేసే ద్రోహం ఎంత పెద్దదో ప్రజలకు తెలుసు. అందుకే వీరి ‘విప్లవం’ పట్ల ప్రజలవిశ్వాసం సన్నగిల్లుతున్నది. ఏ వ్యవస్థ పునాది అయినా అది ఎన్నుకునే విద్యారంగంపై ఆధారపడి ఉంటుంది. తెలంగాణ వచ్చేవరకు తెలంగాణ రాష్ట్రం రాగానే ప్రభుత్వాల మెడలు వంచి ప్రజల మేలుకోసం పాటు పడుతామని ప్రమాణాలు చేసిన వారంతా ఇప్పుడు ప్రభుత్వంలో తమకు ఏమి లభిస్తుందని ఆలోచిస్తున్నారు తప్ప ప్రభుత్వ హామీలను ముఖ్యంగా కె.జి. టు పి.జి. వరకు ఇంగ్లీష్‌ విద్యను అమలుచేయాలని ఒక్క అగ్ర కుల మేధావి అడగడంలేదు. పసికందులు ప్రైవేటు స్కూలు బస్సుల్లో, ఆటోల్లో పొయ్యే విద్యా విధానానికి స్వస్తిచెబుదామని ఎవరూ అడగడం లేదు.
ఏ నిర్ణయాన్ని ఎప్పుడు అమలుచేయాలో ఇప్పుడు ఒక్క కుటుంబం మాత్రమే నిర్ణయించాలి. ఉద్యమ ప్రజాస్వామ్యం ఇప్పుడు పటాపంచలైంది. చిన్న రాష్ట్రంలో పెద్ద అధికార పీఠాల వేట నిరంతరం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమం దోపిడీ దొంగలకు కూడా లెజిటమసీ ఇచ్చింది. రోజూ పత్రికల్లో ఒక కుటుంబ ప్రకటనలు లేదా బీజేపీ, శివసేన వంటి వారు ముస్లింల మీద చేసే యుద్ధం తప్ప మరొకటి కనిపించడం లేదు. విద్యా వ్యాపారంపై పోరాటం చేసే బదులు విద్యా వ్యాపారులు, ప్రైవేట్‌ స్కూళ్ళ యజమానులు (ఇందులో టీచర్‌ ఎమ్మెల్సీలూ, నాయకులూ ఉన్నారు) ప్రభుత్వ రంగంలో ప్రవేశపెట్టాలనుకునే కె.జి.టు పి.జి ఇంగ్లీషు విద్యా విధానాన్ని ఆపడానికి తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మాసాయిపేట రైలు క్రాస్‌ వద్ద చనిపోయిన చిన్నారుల కుటుంబాల సంగతే చూద్దాం. వారికి ప్రభుత్వ రంగంలో ఇం గ్లీషు విద్య కూడా దొరికివుంటే వారి చావులు తప్పేవి, వారి కుటుంబాల ఆర్థిక స్థితి కూడా భిన్నంగా ఉండేది. నెలవారీగా ప్రైవేటు స్కూళ్ళ మీద పెట్టే ఖర్చు ఇంతా అంతాకాదు. తమ పిల్లలకూ ఇంగ్లీష్‌ రావాలనుకునేది బ్రిటిష్‌ వలసవాదం మీదనో, లార్డ్‌ మెకాలే మీదనో ప్రేమతో కాదు. తమ పిల్లలు తమలా కూలీలు కావద్దని. ఇప్పటికే తల్లిదండ్రులకు తెలుగు మీడి యంపై నమ్మకం పోయింది. ఆ కూలీల్లో కొంతమందైనా పదోతరగతి వరకు తెలుగుమీడియం చదువుకున్న వాళ్ళున్నారు. వారు మళ్ళా కూలీలుగానే బతుకుతున్నారు. ఇంగ్లీషు కూడా చదువుకుంటే ఈ విధంగా కూలీ బతుకు బతక్కుండా ఉంటారని ఒక నమ్మకం వాళ్ళలో ఉన్నది. ఈ స్థితిలోనూ ఉపాధ్యాయ సంఘాలు జూలై 27న తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసి తమ సర్వీసు విధానం గురించి అడిగారు. తమకు లెక్చెరర్‌ పదవులు కావాలని అడిగారు కానీ విద్యా విధానాన్ని మార్చండని వాళ్ళు అడుగలేదు. ముఖ్యమంత్రి తాను ఏమి ఆలోచిస్తున్నారో వారికి చెప్పి పంపారు.
తెలంగాణలో గత పదేండ్లలో ప్రైవేట్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూళ్ళు ఎంత పెరిగాయో విద్యా కమిషన్‌ ప్రతి సంవత్సరం ఇచ్చే ఎడ్యుకేషన్‌ స్టాటిస్టిక్స్‌ చూస్తే తెలుస్తుంది. 2012 సంవత్సరాంతానికి ఒక్క రంగారెడ్డి జిల్లాలో 1002, హైదరాబాద్‌లో 744, కరీంనగర్‌లో 604, నల్లగొండలో 485, మహబూబ్‌నగర్‌లో 412, వరంగల్‌ జిల్లాలో 533 ప్రైవేట్‌ స్కూళ్ళు ఉన్నాయి. ఈ ప్రైవేట్‌ స్కూళ్ళన్నీ ఎక్కువగా అగ్రకుల విద్యా వ్యాపారుల చేతుల్లో ఉన్నాయి.
ఈ అగ్రకులాల వారే ఎమ్మెల్సీలు, నాయకులు అవుతారు. వీరి పిల్లలు లెవల్‌ క్రాస్‌ చేయనవసరం లేని హైదరాబాద్‌ సిటీలో ఉండి చదువుతారు. ఒక ఉపాధ్యాయ సంఘ నాయకుడు చెప్పిన సమాచారం ప్రకారం కొంతమంది ప్రభుత్వ టీచర్లు ప్రైవేట్‌ స్కూళ్ళకు పిల్లల్ని గ్రామాలు, కుటుంబాలు తిరిగి సమీకరిస్తారట. ప్రైవేట్‌ స్కూళ్ళలో పాఠాలు చెబుతారట. కానీ ప్రభుత్వ పాఠశాలకు మాత్రం వారానికొక రోజు కూడా పోరట. వీళ్ళంతా ఇప్పుడు తెలంగాణ సెక్రటేరియట్‌ చుట్టూ తిరుగుతున్నారు. ఈ కె.జి. నుంచి పి.జి. వరకు ఇంగ్లీష్‌ విద్య నిర్ణయాన్ని తిరగదోడించాలనేది వారి పట్టుదల.
కనీసం కమ్యూనిస్టు పార్టీలు, విప్లవగ్రూపులు తమ ప్రభావంతో నడిపే విద్యార్థి సంఘాల ద్వారాగానీ, టీచర్ల సంఘాల ద్వారాగానీ టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీని అమలుచేయించడం గురించి చర్చ జరుగుతుందా అంటే అది కనిపించడం లేదు. ఇక మిగిలింది దళిత బహుజన సంఘాలు. ఈ సంఘాలు కూడా విద్యా విధానం మార్పుపై మాట్లాడే ప్రక్రియను సీరియస్‌గా తీసుకోలేదు. కులసంఘాల్లోనూ సంఘనాయకులు తమ పిల్లల్ని ఏదో ఒకటిచేసి ఇంగ్లీష్‌ మీడియం స్కూల్లో చదివించుకుంటారు. కానీ సర్వజన సమానత్వం, సమానపోటీస్థాయి కల్పించే విద్యా రంగం వరకు వచ్చేసరికి వాళ్ళకూ అంతగా పట్టింపు ఉండదు. అంటే తమ పిల్లల విద్య మాత్రమే తమ స్థాయిని కాపాడుతుందని ప్రతి నాయకుడు/నాయకురాలు ఆలోచిస్తారు. దాదాపు అన్ని కులాల్లో (అసలే చదువుకోని కులాలు తప్పితే) విద్యావర్గ లక్షణం ఒకటి వచ్చి కూర్చుంది. ఈ వర్గ వ్యత్యాసాన్ని మార్చగలిగేది కూడా ‘యూనిఫామ్‌ విద్యా విధానం’ మాత్రమే. ఈ అన్ని కారణాల వల్ల ‘సర్వ సమాన ఇంగ్లీషు విద్య’ అందరి పిల్లలకు రాకుండా చూసే కుట్ర వివిధ స్థాయిల్లో ఉంది. నమ్మాలో వద్దో కానీ తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం ‘నేను యూనిఫామ్‌ ఇంగ్లీషు విద్య ప్రేమికుణ్ణి’ అని ప్రకటించుకున్నారు. అయితే ఆయన కుమారుడికీ, కుమార్తెకీ ఇటువంటి ప్రేమ ఉన్నదో లేదో చెబుత లేదు. అమలయ్యే నిర్ణయాలన్నీ కుటుం బం ఐక్యంగా తీసుకుంటుందని వదంతులున్నాయి. కనీసం ఈ ఒక్క నిర్ణయం - అంటే కె.జి. టు పి.జి. ఇంగ్లీషు మీడియం నిర్ణయం సమష్టిగా తీసుకొని అమలుచేస్తే తెలంగాణ రాష్ట్రానికో మేలు జరుగుతుంది.
ఐతే హైదరాబాద్‌, రంగారెడ్డి, వరంగల్‌, కరీంగనర్‌ నగరాల్లో, జిల్లాల్లో వివిధ చోట్ల తిష్ట వేసిన విద్యా వ్యాపారస్తుల ఒత్తిడి తక్కువ ఉంటుందని అనుకోలేం. బస్లుల్లో, ఆటోల్లో పిల్లలు సుదీర్ఘ దూరాలకు పోతూ సచ్చినా మంచిదేనని అన్ని గ్రామాల్లో ఇంగ్లీషు మీడియం విద్య ప్రైవేట్‌రంగం నుంచి ప్రభుత్వ రంగానికి మారడాన్ని వీళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఇంగ్లీష్‌ మీడియం కాలేజీలు ఎత్తేసి అన్ని ఉన్నత పాఠశాలలను 12వ తరగతిలోకి మార్చడాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తారు.
వీళ్ళంతా పార్టీలకు చందాలిస్తారు. మంత్రుల, ఎమ్మెల్యేల అవసరాలు తీరుస్తారు. వీరి డబ్బులముందు తెలంగాణ ప్రజల త్యాగాలు పెద్ద లెక్కలోనివి కావు. తెలంగాణ బీద ప్రజలకు త్యాగాలు చెయ్యడం తెలుసు గానీ, తమపిల్లల్ని బాగుచెయ్యడం తెలువదు కదా! రైలుపట్టాల మీద చనిపోయిన పసికందుల రక్తం ఈ రాష్ట్రంలో అందరికీ ఇంగ్లీషు విద్య కోసం చిందింది. అది వాళ్ళ వాళ్ళ ఊళ్ళల్లో, ప్రభుత్వ స్కూళ్ళల్లో దొరికితే కనీసం వాళ్ళ చావు ఒక సమస్యను పరిష్కరిస్తుంది.
- కంచ ఐలయ్య, సుప్రసిద్ధ రచయిత, సామాజిక శాస్త్రవేత్త

Andhra Jyothi dated 31 July 2014

No comments:

Post a Comment