Pages

Saturday, 19 July 2014


Editorial Namasthe Telangana Logo

పోలవరంపై ఐక్య పోరాటం
Updated : 7/20/2014 1:37:57 AM
Views : 13
ది ఒడిశా మల్కానిగిరి జిల్లా పోడియ బ్లాక్ ఆదివాసీ కోయలు నివసించే ప్రాంతం. దట్టమైన అడువుల కాలిబాటలు కలెవాల్ కలెవాల్ కోయతూర్ కలెవాల్ ఆంప్‌వాల్ ఆంప్‌వాల్ పోలవరం ఆంప్‌వాల్‌అని కోయాతూర్ సమాజంలో అస్తిత్వ నినాదాలు. పోలవరం ప్రాజెక్టును రద్దు చేయాలని ఆదివాసీ సంఘాలు ఒడిశా నుంచి కుంట (ఛత్తీస్‌గఢ్ మీదుగా భద్రాచలం వరకు తలపెట్టిన 15 రోజుల మహాపాదయాత్రలో ఒక కోయ విద్యార్థిగా, రచయితగా నేను భాగస్వామిని అయినాను. నాతోపాటు ఉస్మానియా, కాకతీయ విద్యార్థి సంఘాలు ఈ పాదయాత్ర అనుభవం నుంచి అన్ని అంశాలను మీ ముందు ఉంచుతున్నాము.

పోలవరం ముంపు ప్రాంతాలు ఆంధ్ర, తెలంగాణలో ఉంటే పాదయాత్ర ఒరిస్సా నుంచి ఎందుకు మొదలయింది అన్నప్పుడు అనేక విషయాలు బయటకొస్తాయి. కోయ సమాజాన్ని గోదావరి పరివాహక ప్రాతం ఇరువైపుల శ్రీరాంసాగర్ (మహదేవ్‌పూర్ నుంచి) ఏటూరు నాగారం, భద్రాచలం మీదుగా పశ్చిమగోదావరి పోలవరం వరకు చూడవచ్చు. ఈ ప్రాజెక్టు వల్ల జలసమాధి అయ్యేది మూడు లక్షల మంది కోయ కొండరెడ్లు. ఇది గోదావరి నదికి సంబంధించిన ముంపు. కానీ ఈ ప్రాజెక్టు వల్ల, గోదావరి నీరు కమ్ముకోవటం మూలంగా, వి.ఆర్.పురం దగ్గర విలీనమయ్యే శబరి, సీలేరు నదులు గోదావరికి తాకి వెనుకకు నీరు మళ్లటం మూలంగా మళ్లీ ఈ రెండు నదుల పరివాహక ప్రాంతంలో జలసమాధి అయ్యేది కోయ సమాజమే.

ఒడిశా ప్రభుత్వం 17 ముంపు గ్రామాలని ప్రకటించింది. కాని ఈ రెండు నదుల ఇరువైపుల సర్వే నిర్వహిస్తే 139 గ్రామాలు లక్ష జనాభా, లక్షల ఎకరాల అటవీ భూమి, వేలాది ఎకరాల పంట భూములు మునిగిపోతాయి. అయినా ఇక్కడివారికి ముంపు సంగతి తెలియదు. ప్రభుత్వం చెప్పడం లేదు. నది దాటితే కుంట (ఛత్తీస్‌గఢ్) కోయ ప్రాంతం. ఇది తెలుగు గిరిజనేతరుల వలస ప్రాంతం. ఇక్కడ 14 గ్రామాలు మునుగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. కానీ 50 గ్రామాల వరకు మునుగుతాయి.

కానీ మొన్నటిదాక ఈ ప్రాజెక్టును వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కనుక మౌనం వహిస్తున్నది. ఆంధ్రలోని తూర్పు, పశ్చిమ గోదావరి కోయ కొండ రెడ్డిలది మరీ దారుణ సమస్య. ప్రభుత్వంతో పాటు అన్ని వర్గాలు పోలవరం నిర్మించాలంటున్నాయి.

ఈ రాష్ర్టాల్లోని కోయ సమాజం నేడు ఒక ప్రశ్నను సంధిస్తున్నది. పూర్వం మధ్య భారతాన్ని పాలించింది గోండులు (కోయాతూర్)లు.1956లో భాషాప్రయుక్త రాష్ర్టాలు ఏర్పాటు చేసినప్పుడు- మా ప్రాంతాన్ని పరిపాలించిన చరిత్ర, భూభాగం, ప్రత్యేక భాష, సంస్కృతీ సంప్రదాయాలు కలిగివున్నాం, మాకు ప్రత్యేక రాష్ర్టం కావాలంటే బలవంతంగా విడదీసి ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, నేటి తెలంగాణలుగా విభజించారు. ఒరియా, హిందీ, తెలుగు పరాయి భాషలు రాక, మాతృ భాషలకు విలువ లేక దుర్భర స్థితిలో ఉన్నాం. ఏ రాష్ట్రం అభివృద్ధి మా దరి చేరలేదు.

అడవితల్లిని నమ్ముకొని ఎవరితో సంబంధం లేకుండా జీవిస్తున్నాం. మళ్లీ ఇప్పుడు పోలవరం పేరిట మా మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం అనంతరం ప్రత్యేక భారతం కావాలన్న ఆదివాసీలకు ప్రత్యామ్నాయ స్వయం ప్రతిపత్తి అని రాజ్యాంగంలో 5వ షెడ్యూలు మీరే చేశారు. పెసా అటవీ హక్కుల చట్టాలను చేశారు. 1/70 చట్టాన్ని మీరే చేశారు.

వాటన్నింటిని మీరే ఉల్లంఘించారు. ప్రజాస్వామ్యంలో ప్రతివ్యక్తి జీవించే హక్కును కలిగి వున్నాడు. అందుకే ఏదైనా పెద్ద ప్రాజెక్టు నిర్మాణం జరిగేటపుడు ఆయా ప్రాంతాల వ్యక్తులు ఆ ప్రాంతంలో జీవించే హక్కును కోల్పేయే అవకాశం ఉన్నందున, ప్రజాభిప్రాయసేకరణ జరపాలి అని రాజ్యాంగం చెబుతున్నది. కాని ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు జరపలేదు? అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జీవనాన్నే కొల్లగొడుతున్నపుడు కోయల దారి ఎటువైపు మళ్ళుతుంది అనేది కూడా అర్థం కాని ప్రశ్న.
పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో కలపటం కలుపకపోవటం పక్కనపెడితే ఈ రెండు ప్రాంతాలతో మేము ఎటువైపు అనేది అర్థం కాక కోయ సమాజం మానసిక క్షోభను అనుభవిస్తున్నది.

విద్యార్థులకు కుల ఆదాయ నివాస ధ్రువీకరణ పత్రాల అవసరం. తహశీల్దారు ఆఫీసుకెళితే ఏ రాష్ట్రం ధ్రువీకరణ పత్రం ఇస్తాడో తెలియదు. ఏ యూనివర్సిటీలో, కళాశాలలో దరఖాస్తు చేయాలో తెలియదు. ఫీజు రియింబర్స్‌మెంటు ఎవరిస్తారు? ఉద్యోగాల కోసం ఏ రాష్ట్రంలో దరఖాస్తు చేయాలి, ఉద్యోగస్తులకు ఏ ప్రభు త్వం జీతాలిస్తుంది? బలికోరాం రండి మా రాష్ర్టానికి అని ఆంధ్రప్రాంతం పిలిచినట్టా, బలిచ్చినా ఎరుగనట్టి తెలంగాణ ప్రాంతమా అన్నట్టుగ ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం బలమైన పోరాటం చేయకుండా డిజైన్ మార్చాలని ఏ రంధి లేకుండా పునర్నిర్మాణం చేసుకుంటుంది.


ఇటువంటి సమయంలో కోయ సమాజాన్ని ఎలా కాపాడుకోవాలన్నపుడు, పోలవరం ఉద్యమాన్ని ఉధృతం చేయాలన్నపుడు కొన్ని రకాల పరిష్కారాల మార్గాలను వెతుకాల్సిన అవసరం ఏర్పడింది. భారతదేశాన్నే పునర్నిర్మాణం చేసే అంత మేధోసంపత్తి తెలంగాణ మైదాన ప్రాంతంలో వున్నది. అదే నేటి తెలంగాణ రాష్ర్టాన్ని నిలబెట్టగలిగింది. ఏ రాజకీయ ఉద్యమం దీనికి కారణం కాదు. తెలంగాణ కోసం 60 ఏళ్ళు శ్రమించిన ఈ మేధో సంపత్తి పోలవరం కోసం ఆదివాసీల పక్షాన ఉపయోగపడటం లేదు.

ఆదివాసీ పోరాటానికి పదును పెట్టే ప్రయత్నం చేయడం లేదు. చరిత్రలో ఆదివాసీ పోరాటాలయిన కొమురం భీం, బిర్సాముండా, సాయం గంగులు, మన్యం పోరాటాలన్నింటిని ఆదివాసీలే నడిపినా వాటి వెనుక మైదాన ప్రాంతాల మేధావుల హస్తం కొంతమేర అయి నా వుంటుంది. అది మళ్ళీ పోలవరం ఉద్యమంతో పునరావృతమవ్వాలి.

వందలాది పాఠశాలలు, కళాశాలలు ముంపునకు గురవుతున్నందున విద్యార్థి ఉద్యమాన్ని బలోపేతం చేయాలి. ముంపు అనేది ఆదివాసీ ఉమ్మడి సంప్రదాయక జీవనవ్యవస్థతో ముడిపడి ఉన్నందున ఆదివాసీ సాంస్కృతిక ఉద్యమాన్ని బలోపేతం చేయాలి. 7 గ్రామాలు 8 వేల జనాభా గల పోస్కో ఉద్యమం, పోస్కో ఉక్కు ఫ్యాక్టరీని అడ్డుకుంది. ఒడిశాలోని నియంగిరి కొండల్లోని నిరక్షరాస్య కోయలు విజయం సాధించారు.

కానీ మూడు లక్షల ఆదివాసీ జనాభా, ఉద్యమ చరిత్ర, విద్యా చైతన్యం గల మనం బలమైన ఉద్యమ నిర్మా ణం ఎందుకు చేయలేక పోతున్నాం అనేది ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఆదివాసీ సంఘాల మధ్య, వ్యక్తుల మధ్య వైరుధ్యాలు మనుగడకే ముప్పు తెస్తున్నాయని గ్రహించాలె. ఆదివాసీ ప్రాంతాన్ని మొత్తం ప్రత్యేక ప్రాంతంగా ప్రకటించుకుంటున్నాం.

మాకు ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు మాకొద్దు, ఏ ప్రభుత్వాలు మాకు బువ్వపెట్టలేదు. మేము అప్పుడూ ఇప్పుడూ అడవినే నమ్ముకుని బతుకుతున్నాం. బతుకుతాం. మమ్మల్ని ముంచాలని చూస్తే ఊరుకునేది లేదు అని బలమైన సంకేతం ఇచ్చిన రోజు ప్రభుత్వాలే ఆదివాసీల దగ్గరకి వస్తాయనేది చరిత్రలో ఆదివాసీల సంప్రదాయ పోరాటాలు నిర్థారించిన విషయం అందరికి తెలిసిందే.

http://namasthetelangaana.com/EditPage/Essays.aspx?category=1&subCategory=7&ContentId=387599

Source  : Namaste TElangana DAted 20th July 2014

No comments:

Post a Comment