Pages

Wednesday, 5 February 2014




Namasthe Telangana

2/2/2014 1:53:57 AM
 
 
వనదేవతల జాతర
తరతరాల సాంప్రదాయం మనది. వేల సంవత్సరాల ఆచార వ్యవహారాలు మనవి. తరాలు మారుతున్నా అంతరాలు పెరుగుతున్నా సంస్కతి సాంప్రదాయాలు కొత్త పుంతలు తొక్కుతూ తన ఆస్తిత్వాన్ని చాటుకుంటూ కంప్యూటర్ యుగంలో కూడా విషసంస్కతి నుంచి విడిపోతూ తనని తాను కాపాడుకుంటూ వందల సంవత్సరాల జాతరకు ప్రతీకలై నిలుస్తున్న ఓరుగల్లు జిల్లాలోని తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారమ్మ జాతర ప్రపంచ మానవాళి చరిత్రలోనే ఓ అద్భుత ఘట్టం. ఓ అరుదైన సంఘటనలకు నెలువైన ప్రాంతం రాచరికపు వ్యవస్థపై దోపిడీ పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా తమ జాతి జనుల కోసం ప్రాణాలర్పించిన సమ్మక్క సారమ్మలను వనదేవతలుగా నాటి నుంచి నేటివరకు కొలుస్తూనే వున్నాం.

భవిష్యత్ తరాలు కూడా ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా నిస్సందేహంగా వన దేవతలు ఇలవేల్పులై (గోండుకోయలు) ఇలవేల్పయి పూజింపబడుతూనే ఉన్నారు. ఎన్నో అరుదైన వక్షజాతుల సమూహం కిలకిల పలికే కోయిల రాగాలా సమాహారం కల్మషం లేని స్వచ్ఛతకు నిలువెత్తు నిదర్శనమై జంపన్న వాగై ప్రవహిస్తూ, నిత్యం కుటుంబ జీవితమంటే ప్రేమానురాగాలే జనం కోసమే బ్రతకాలి. జనం కోసమే చావాలి అని చెప్పిన కుటుంబం సమ్మక్క పై డిద్ధ రాజుల కుటుంబం.

ఈ ఆధునిక యుగంలో ఒక చిన్న సంఘటన జరిగితే ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పే రాజకీయ నాయకులు తమ ఇంట్లో సమస్య వస్తే ఊరందరి సమస్యల చూసే స్వార్థపూరిత నాయకులు వనదేవతల చరిత్రను నేటికీ పూర్తిస్థాయిలో ప్రజలకు అందించలేదు. పైగా అక్కడ కూడా కాసులకు కక్కుర్తిపడి గుళ్ళు గోపురాలు కట్టి గిరిజన సాంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు శఠగోపం పెడుతున్నారు. ఎవరో కొంతమంది అధికారంలో ఉండి చనిపోతే వారిపేర్లమీద జిల్లాల పేర్లు, మండలాల పేర్లు ఏర్పాటు చేసిన సంఘటనలు లెక్కకు మించినవి. కానీ మన సమ్మక్క సారలమ్మ వందల సంవత్సరాల పూర్వమే అడవిబిడ్డల కోసం అన్యాయాన్ని ఎదిరించి వీరనారులైండ్రు.

ప్రభుత్వం కాస్త ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ, భారీ ప్రకటనలు చేస్తూ ఏర్పాట్లు భారీగా చేస్తున్నామంటూ అవినీతి రాజకీయ నాయకుల అభివద్ధి కోసం పనులు వారికి కట్టబెడుతూ అడవి బిడ్డలను పక్కన పెడుతున్నారు. ఏ జనం కోసం సమ్మక్క వీరనారి అయ్యిందో ఆ జనాన్నే నేడు పాలకులు ధనం కోసం ముంచుతున్నారు. మరో ప్రమాదకరమైన విషయం ఏమిటంటే ఓ నాడు మేడారం అంటే ఓ అందమైన వనదేవతల నెలవు. కానీ నేడు పూర్తిగా మారిపోయింది. మేడారం కాస్త ఓ కాంక్రీట్ జంగిల్‌లా మారింది. అభివద్ధి పేరు మీద వక్షాలను నరికివేస్తూ నరరూప రాక్షత్వాన్ని ప్రదర్శిస్తూ పచ్చని వనదేవత తీరని ద్రోహం చేస్తూ సంబురాలు చేసుకుంటున్నారు. వక్షాలపై ఆధారపడి జీవనం సాగించే అనేక రకాల పక్షి జీవజాలం అంతరించిపోయే దశకు చేరుకుంది. అడవి జంతువుల మాట మచ్చుకైన కనిపించడంలేదు. దానికితోడు అనేక విధాలుగా అడవిబిడ్డల అనేక రకాలు ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

మేడారం జాతర ప్రపంచంలోనే ఓ అరుదైన సంఘటన అనటంలో ఎటువంటి సందేహంలేదు. దాదాపు కోటిమంది ప్రజలు దేశం నలుమూలల నుంచి వచ్చి ముచ్చటగా మూడురోజుల పండుగకు సిద్ధమవుతారు. వారి రాకతో వన దేవతలు పులకించిపోతారు. కాని వచ్చేవారు.

వస్తూ పోయేవారు పోక ఆ ప్రాంతాల్ని పర్యావరణ కాలుష్యంలో నింపివేసి వెళ్ళుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలి. జాతర మీద వచ్చే ఆదాయంపై ఆశ పడకుండా జాతర పవిత్రతను ప్రత్యేకతను ప్రజలందరికి పేపర్ల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విస్త్రత ప్రచారం కల్పించి మేడారం భక్తులందరికి ప్లాస్టిక్ కవర్లు, వాటర్ బాటిల్స్ తీసుకురాద్దని, చెట్లను తొలగించవద్దని ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ప్రకటనలు చేస్తూ ఉండాలి. జాతరలో విఐపీలు వీవీఐపీలు అంటూ సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలకు స్వస్తిపలకాలి. వనదేవతల ముందు అందరూ సమానమే అన్న నినాదాన్ని ప్రతి ఒక్కరూ గమనంలో ఉంచుకోవాలి.

వన దేవతలు గద్దెల మీద చేరేటప్పుడు అధిక శబ్దం చేసి ముందుగుండు సామాగ్రి అసలు కాల్చకపోవడం మంచిది. దానివల్ల శబ్ద, వాయుకాలుష్యం పెరిగి అమ్మవార్ల పవిత్రను అపవిత్రం చేస్తున్నారు. విజ్ఞతగల పౌరులుగా జాతరతో పాల్గొని మధురమైన జ్ఞాపకాలను వనదేవతల ఆశీస్సులను అందుకొని భావితరాలకు ఓరుగల్లు చరిత్రను మరీ ముఖ్యంగా మేడారం పవిత్రతను కాపాడవలసిన బాధ్యత మనందరిమీద ఉంది.

1. అన్ని రాజకీయ పార్టీలు మేడారం పవిత్రత పట్ల స్పష్టమైన ప్రకటన చేయాలి.
2. గిరిజన విశ్వవిద్యాలయం తాడ్వాయిలో ఏర్పాటు చేయాలి.
3. గిరిజనులకు మాత్ర మే అభివద్ధి కార్యక్రమాలు కాంట్రాక్టు ఇవ్వాలి.
4.అడవి పై అధికారాలు, జాతరపై వచ్చే ఆదాయం అడవి బిడ్డలకే చెందాలి.
5. మేడారంలోని జీవవైవిధ్యాన్ని కాపాడడానికి అసెంబ్లీ ప్రత్యేక చట్టం తేవాలి.
6. గిరిజనుల ఆచార వ్యవహారాలను కచ్చితంగా జాతరకు వచ్చేవారు పాటించాల న్న జీవోలు ప్రభుత్వం విడుదల చేయాలి.
7. మేడారాన్ని కాలుష్యరహిత ప్రాంతంగా ప్రకటించాలి.
8. ప్లాస్టిక్ బాటి ల్స్, ప్లాస్టిక్ కవర్లు తీసుకురాకుండా గుడ్డసంచులు తీసుకురావాలని భక్తులకు పిలుపునివ్వాలి.
9. వ్యక్తిగత రవాణాను నిలిపివేసి, ప్రజారవాణాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలి. అనవసరపు శబ్దాన్ని తగ్గిద్దాం.
10.జీవహానిని నిర్మూలిద్దాం.
11. మేడారం ప్రాంతం అభివద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి, ప్రత్యేక చొరవ చూపించాలి.
12. వందకోట్ల రూపాయల నిధులు కేటాయించి, ప్రపంచస్థాయి గిరిజన మ్యూజియం ఏర్పాటు చేయాలి.
-సీహెచ్ భద్ర, పర్యావరణవేత్త

No comments:

Post a Comment