Article on Hijrams (Third Gender)
లైంగిక దోపిడీ ఎవరికీ ఇష్టం కాదు..
వాళ్లూ మనలాంటి మనుషులే అనే విషయాన్ని గుర్తించడానికి మన ఘనమైన దేశానికి వందేళ్ల కాలం పట్టింది. స్త్రీలూ, పురుషులూ కానివారంటూ వారిని సమాజం ఈసడించింది. కుటుంబాలకు దూరం చేసింది. వ్యభిచారంలోకి దింపింది. చదువుల్లేకుండా చేసింది. పనికి దూరం చేసింది. గౌరవంగా జీవించే హక్కు లేకుండా వెలేసింది. వాళ్ళు యావత్ సమాజంచేత వెలివేయబడ్డవాళ్లు, తమది కాని నేరానికి తక్కిన మానవ సమూహానికే దూరం చేయబడ్డ వాళ్లు, ఒక్కమాటలో చెప్పాలంటే వారు ఇన్నాళ్లుగా ఏ హక్కులూ లేనివాళ్లు, గుర్తింపు కార్డులు లేనివాళ్లు, సమాజంలో తమకు చేతనైన పని చేసుకోవడానికి కనీస అర్హతలు కూడా కోల్పోయిన వాళ్లు. వందేళ్లపాటు నేరస్థ తెగగా ముద్రపడి సమాజానికి దూరమైన వాళ్లు. వాళ్లు హిజ్రాలు, ట్రాన్స్‌జెండర్లు, తృతీయ ప్రకృతి జీవులు.కారుచీకటిలో కాంతిరేఖలా ఇవ్వాళ వీరి జీవితాల్లో చిరువెలుగు. వాళ్లు కూడా మనుషులే అంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం తిరుగులేని తీర్పు ఇచ్చిన రోజు. దేశంలోని తృతీయ ప్రకృతికి చెందిన వారి బతుకులను దీప్తివంతం చేసిన ఈ తీర్పు ఇన్నాళ్లుగా తమ హక్కులకోసం పోరాడుతున్న వారిపై పన్నీరు చిలకరించింది. ఈ సందర్భంగా ప్రముఖ ట్రాన్స్‌జెండర్ హక్కుల కార్యకర్త, నటి, సహోదరి ఫౌండేషన్ సంస్థాపకురాలు కల్కి సుబ్రహ్మణ్యం స్పందనను ప్రచురిస్తున్నాము.
భారత దేశంలో అటు స్త్రీలు, ఇటు పురుషులూ కానివారికి ఈ మంగళవారం ఒక శాశ్వత స్మృతిగా మిగిలిపోతుంది. ఎందుకంటే హిజ్రాలను ‘తృతీయ ప్రకృతి’గా(3వ జెండర్) గుర్తిస్తూ సుప్రీంకోర్టు మంగళవారం చారిత్రాత్మక తీర్పునిచ్చింది. వోటర్ గుర్తింపు కార్డులు, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్సుతోసహా అన్ని సౌకర్యాలను హిజ్రాలకు కూడా అందచేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. హిజ్రాలకు ఆరోగ్య సంరక్షణ, విద్య, ఉపాధి తదితర అవకాశాలను కూడా కల్పించి వారిని ప్రధాన జీవన స్రవంతిలోకి తీసుకురావడానికి తగిన చర్యలను తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్రాలను ఆదేశించింది. సమాజంలో హిజ్రాలకు ఎదురవుతున్న వేధింపులు, వివక్ష పట్ల ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. వారి సంక్షేమానికి కొన్ని ఆదేశాలను జారీ చేసింది.
సుప్రీంకోర్టు తీర్పు చరిత్రలో నిల్చిపోయే తీర్పుల్లో ఒకటనడంలో ఎలాంటి సందేహం లేదు. కాని మనం గుర్తు పెట్టుకోవలసిన విషయం ఒకటుంది. హిజ్రాలు లేదా తృతీయ ప్రకృతి కలిగిన వారు మన సమాజానికి కొత్త కాదు. మన దేశ చరిత్ర పూర్వనుండి హిజ్రాలు, లింగమార్పిడిదారుల ఉనికిని నమోదు చేస్తూనే వచ్చింది.
కాని వందేళ్ల క్రితం బ్రిటిష్ పాలకులు వీరిని నేరస్థుల ముఠాగా ముద్ర వేయడంతో యావత్ సమాజం వీరిని అపార్థం చేసుకోవడం మొదలైంది. నాటి నుంచి నేటి వరకు వీరు సమాజం నుంచి వెలివేయబడుతున్నారు. అవమానించబడుతున్నారు. లైంగిక దోపిడికి గురవుతున్నారు. సమాజం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరి కారణంగా హిజ్రాలు, లింగమార్పిడిదారులు తమ కుటుంబాలనుంచి దూరం చేయబడ్డారు. భారతీయ హిజ్రాలు నేటికీ యాచకుల్లాగే మిగిలిపోయారు. వందేళ్లుగా తమ హక్కుల కోసం వారు పోరాడుతున్నారు. లైంగికంగా దోపిడి చేయబడుతున్నారు.
కుటుంబాలు త్యజించినప్పటికీ హిజ్రా కమ్యూనిటీలోని ఇతర లింగమార్పిడిదారులతో వీరు జీవిస్తున్నారు. ఒక లింగమార్పిడిదారుకు సమాజంలో జీవితం కొనసాగించడం నిజంగానే నరకప్రాయం అవుతోంది. ఎందుకంటే యావత్ సమాజం నిర్లక్ష్యం ప్రదర్శించడం కారణంగా వీరిని అన్ని తరగతుల వారు తప్పుగా అర్థం చేసుకంటూ దూరం పెడుతూ వస్తున్నారు.
మంగళవారం సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రాత్మక తీర్పు కారణంగా దేశంలోని యావన్మంది హిజ్రాలు, లింగమార్పిడిదారులకు చరిత్రలో మొదటిసారిగా సామాజిక గుర్తింపు లభించింది. లింగమార్పిడి దారులకు ప్రాణాధారమైన కుటుంబ సమ్మతికి కూడా ఈ తీర్పు వీలు కలిగించింది. ఈ అద్భుత సందర్భంలో సమానత్వం కోసం చేస్తున్న పోరాటంలో చివరికంటా నిలిచిన తోటి కార్యకర్తలకు సెల్యూట్ చేస్తున్నాను.
ఇలాంటి తీర్పుకోసం, సమాజంలో ఇలాంటి మౌలిక పరివర్తన కోసం అనేక సంవత్సరాలుగా మేం పోరాడుతూ వస్తున్నాం. సమాజం పెట్టిన సమస్త అడ్డుగోడలకు ఎదురొడ్డి సాహసోపేతంగా జీవితాన్ని కొనసాగించిన, హక్కుల కోసం ఎలుగెత్తి చాటిన విద్యావంతులు, అవిద్యావంతులు అయిన హిజ్రా కమ్యూనిటీ ప్రజలకు ఇదొక చారిత్రక క్షణం, ఈ దేశ హిజ్రాలు గర్వించే క్షణం.
నేటి భారతీయ చట్టాల గురించి మాట్లాడినట్లయితే, మన రాజ్యాంగం లోని 21వ ఆర్టికల్ హిజ్రాలతో సహా దేశ పౌరులందరి గోప్యత, వ్యక్తిగత గౌరవ రక్షణ హక్కును కల్పించింది. మనుషులు, యాచకుల, నిర్బంధ కూలీల అక్రమ రవాణాను ఆర్టికల్ 23 నిషేధించింది. ఇంకా రాజ్యాంగంలో మరెన్నో నిబంధనలు ఉన్నాయి. ప్రత్యేకించి 14, 15 ఆర్టికల్స్ మతం, జాతి, సెక్స్, జన్మస్థలం ప్రాతిపదికన వివక్షత చూపడాన్ని నిషేధించాయి. ఈ రకమైన చట్టాలు స్త్రీ పురుషులకు మాత్రమే సంబంధించినవి కాదు. అవి భారత పౌరుల, వ్యక్తుల గురించి ప్రస్తావిస్తున్నాయి. లింగమార్పిడిదారులు భారత పౌరులు. ఈ చట్టాలు హిజ్రాలు, లింగమార్పిడిదారులతో సహా సమస్త వ్యక్తుల హక్కులను కాపాడుతున్నాయి కాని అవన్నీ పుస్తకాలకు మాత్రమే పరిమితం అయ్యాయి.
దశాబ్దాలుగా చట్టాలపరంగా సాగుతున్న నిర్లక్ష్య ధోరణికి సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసింది. హిజ్రాలు, లింగమార్పిడిదారుల విద్య, ఉపాధి, వాక్ స్వాతంత్ర్యం, ఇల్లు, కుటుంబం, పెళ్లి, పిల్లలను దత్తత చేసుకోవడం వంటి అన్ని హక్కులను భవిష్యత్తులో గుర్తించడానికి తగిన మార్గాన్ని సుప్రీం తీర్పు కల్పించింది. ఈ చారిత్రాత్మకమైన, అద్భుతమైన తీర్పు ద్వారా లింగమార్పిడి వ్యక్తులకు ఈ అపరూపమైన హక్కులు దఖలు కానున్నాయి.
ఎవరూ యాచకులు కావాలని అనుకోరు. లైంగికంగా దోపిడికి గురవాలని ఎవరూ అనుకోరు. ఈ దేశంలో మనుషులందరిలాగే మేము కూడా జీవించాలనుకుంటున్నాం. మాకు కుటుంబాలు కావాలి. మాకూ సంతోషం కావాలి. పౌర సమాజంకోసం దేశ సంక్షేమానికి పాటువడాల్సిన సామాజిక విధి, బాధ్యత మాపై ఉంది. ఇలా కాకుండా మమ్మల్ని వదిలివేయడం, దూరం పెట్టడం వల్ల మా జీవితం నరకప్రాయంగా మారుతుంది. ఈ తీర్పు రాబోయే తరాల్లో మా భవిష్యత్తుకు సంబంధించి ఆశల్ని రేకెత్తించింది. సుప్రీంకోర్టు మాకు న్యాయపరంగా ఓ దారి కల్పించింది కనుక కనీసం వచ్చే తరం హిజ్రాలయినా యాచకులుగా ఉండరని, వ్యభిచారం జోలికి వెళ్లేరని ఆశిస్తున్నాం.
హిజ్రా కమ్యూనిటీలోమని టీనేజర్లు తమ విద్యను ఇకనుంచి సజావుగా కొనసాగించ గలరని ఆశిస్తున్నాం. హిజ్రాలలో చదువు మానేవారి సంఖ్య తగ్గుతుందని ఆశిస్తున్నాం. మధ్యలోనే బడి మానేస్తున్నందునే నేడు లింగమార్పిడి వ్యక్తులు యాచక వృత్తి చేపడుతున్నారు. వ్యభిచారపు ఊిబిలో కూరుకుపోతున్నారు. ఈ తీర్పుతో వీరందరూ మంచి విద్య పొందేందుకు వీలవుతుంది. దీనిఫలితంగా వీరికి మంచి ఉద్యోగాలు వచ్చే వీలుంది. ఒకవేళ కుటుంబం వారిని వదిలేసినప్పటికీ ఇకపై ఆర్థికంగా స్వతంత్ర జీవనాన్ని ఎంచుకునే అవకాశం ఉంది.
నేను ఒక కుటుంబాన్ని కోరుకుంటున్నాను కనుక వ్యక్తిగతంగా ఈ తీర్పును నేను స్వాగతిస్తున్నా. నాకు పిల్లలు కలిగే భాగ్యం లేనప్పటికీ నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నాకిష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకుని పిల్లలను దత్తత చేసుకోవాలనుకుంటున్నాను. ఆ జీవితాన్ని పొందడం, ఆశించడం సాధ్యమేనన్న ఆశను సుప్రీంకోర్టు నాలో కలిగిస్తోంది.
(కల్కి సుబ్రహ్మణ్యం ఒక ట్రాన్స్‌జెండర్ హక్కుల కార్యకర్త. ఒక నటి, లింగ మార్పిడి చేసుకున్న స్త్రీ, ఈమె సహోదరి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు. ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీకి సామాజిక, ఆర్థిక, న్యాయ గుర్తింపు కోసం ఇది పనిచేస్తోంది. ఆడ మగ కానివారికి, తృతీయ ప్రకృతి జీవులకు రాజ్యాంగ పరమైన హక్కులను దఖలు పరుస్తూ సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన సందర్భంలో కల్కి సుబ్రహ్మణ్యం తన అభిప్రాయాలను బ్లాగ్‌లో పెట్టారు. ఆంధ్రప్రభ.కామ్ పాఠకులకోసం ఆమె స్పందనను ప్రత్యేకంగా అందిస్తున్నాం.)
Source: http://www.andhraprabha.com/lifestyle/nobody-wants-to-be-exploited-sexually/15763.html
dated 7th May 2014
Basic source: http://www.sahodari.org/contact.html
Basic source: http://www.sahodari.org/contact.html
No comments:
Post a Comment