అంతరిస్తున్న ఆదివాసి అస్తిత్వాలు : ప్రశ్నార్థకంగా మారిన నల్లమల చెంచుల జీవితాలు
Posted December 29, 2010
on: - In: Adivasis | Telugu
- Leave a Comment
ఈ మధ్య కాలంలో డెబీర్స్ మైనింగ్ కు నల్లమలలో అనుమతి లభించింది అన్న వార్త, గుండెలో దడ పుట్టించింది, పోస్కో లు, వేదాంతాలు వంటి భయంకర ప్రాజెక్ట్లు, పోలవరం లాంటి(అవి) నీ(తి)టి కుంభకోణాలు మంటలు ఆరి పోనే లేదు , అడవులు , పర్యావరణం, ఆదివాసీలు, రక్షించు కోవడానికి ఉద్యమాలు నడిచి, ఆగి, నడుస్తుంటే, మరోవైపు ఈ వజ్రాల మైనింగ్ పేరుతో నల్లమల లో మరొక దెబ్బ. సహజ సంపదను దోచుకోవడంలో ఇపుడున్న ఏకైక మార్గం. భూగర్భ జలాలు, పెట్రోల్, చమురు,బొగ్గు , సున్నం గ్యాస్, జంతువులు అన్ని అయిపోయి ఉండవచ్చు , ఇపుడున్నవి, ఇనుము, బాక్సైట్ లాంటివి, రంగు రాళ్ళు, వజ్రాలు కూడ సుమా!
ఆదివాసిలంటే ఇలా ఉండును, అలా ఉండును, అందంగా ఉండును అని చెప్పుకొనే రోజు ఎంతో దూరం లేదోమో బహుశః, కొండలు, గుట్టలు, వన్య ప్రాణులు, అడవులను ఫోటోలలో, వీడియోలలలో, చూసుకొనే దుస్తితికి రావడం తద్యం అని కూడ అనిపిస్తుంది . హటాత్తుగా మనకి జంతువులపై ప్రేమ పుట్టుకొచ్చింది, అదికూడా అడవుల్లోనే, ఎక్కడైతే తర తరాలుగా, అడవి జంతువులతో మమేకమై జీవిస్తున్న ఆదిమ జాతులున్నారో అక్కడ మాత్రమె ‘జంతు సంరక్షణ’ పేరుతొ, జంతువులతో అవినాభావ సంబంధం ఉన్న ఆదివాసీలను ఎరివేసి, వారి బతుకును వారిని బతక నీయకుండ చేసి, ‘గ్రీన్ హంట్ ‘ పేరుతొ మావో లను ఎరివేస్తాము అని, ఆదివాసిలను భయ బ్రాన్తులకు గురి చేసి, కోట్లాది రూపాయలు పోలీసులు, రకరకాల బలగాల పై ఖర్చు పెడుతూ, మరో వైపు జంతువులను కాపాడుతున్నాము అని వాటి సంరక్షణ కొరకు మరి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాఋ . అసలు జంతువులు ఉన్నట్లు ప్రభుత్వం కళ్ళు తెరిచింది ఎపుడు? అవి అంతం అయి పోవడానికి ఆదివాసీలే కారణం అని జ్ఞానోదయం అయింది ఎపుడు? ఎలా? ఎన్ని సాక్షాలు తీసుకొని, ఎన్నో కోట్లు గుమ్మరించి, సాధించిన ఘన విజయాలు గత పదేళ్ళలో ఏమిటి? అడవులలో అన్నలు ఉండును, అవి వారికి నివాస స్థలాలు , ఆదివాసీలు ఆతిద్యం ఇచ్చును అని తమ మానాన తాము బ్రతుకుతూ, ‘సో కాల్డ్’ నాగరిక సమాజానికి దూరంగా ఉన్న అమాయక ఆదివాసిలను హింసిస్తూ , విడగోడుతూ, చెడగోడుతూ ‘సాల్వ జుడుం’ లాంటి ‘ముఠా’ లను తయారు చేసి వారి మధ్యే చిచ్చు పెట్టి ఒకరిని ఒకరు చంపుకునే స్తితికి తీసుకు వచ్చిన ‘(అ)ప్రజాస్వామ్య’ ప్రభుత్వాలు, అంతరిస్తున్న అత్యంత విలువైన ఆదిమ జాతుల మనుగడ ప్రస్నార్తకంగా మారడానికి ఏ రకముగా భాద్యత వహిస్తాయి? నేడు ప్రపంచానికి ఏమని సమాధానం చెపుతాయి? దేశ వ్యాప్తంగా నేడు ఆదివాసిల పరిస్తితి దాదాపుగా ఒకే రకంగా ఉన్నా, వీరిని కాపాడడంలో, చైతన్య పరచడంలో , ఉద్యమాలు నిర్మించడంలో ఆయా ప్రభుత్వాలు, అక్కడి ప్రజల ఆర్ధిక , రాజకీయ , సామాజిక అవగాహనల పై రక రకాలుగా ఉద్యమాలు నడుస్తున్నాయి. ప్రస్తుతం నల్లమల చెంచుల పరిస్తితి దయనీయంగా మారింది, అటు పోలిసుల చేతిలో, ఇటు అటవీ శాఖ అధికారుల నిర్లక్షంతో, రోజు రోజు కు వారి జనాభా గణనీయంగా తగ్గి పోతుందీ.
చెంచులని ప్రిమిటివ్ ట్రిబల్ గ్రూప్ (PTG) గా 1975 లో (GOI 85-90 Schedule Tribe of A.P under SC & ST (modification ) order list 1956 ) క్రింద గుర్తించారు. 1991 ఇక్కడ జనాభా లెక్కల ప్రకారం 40869 , 2001 సంవత్సర జనాభా కూడ ౪౧౭౮౭, ( చైనాకి దీటుగా ఫ్యామిలి ప్లానింగ్ పాటించారు అనుకోవాలి కాబోలు) ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న చెంచులు తెలుగు మాట్లాడతారు. తరువాత నాగార్జున సాగర్ టైగర్ రిసర్వ్ (NSTR) ని 1983 ఐదు జిల్లాలో, నల్లగొండ, మహాబుబనగర్, కర్నూలు, ప్రకాశం లో 3570 స్క్వేర్ కిలోమిటర్ ప్రాంతం గా ప్రకటించారు. అయితే ఈ నల్లమల పులుల రిసర్వ్ కింద ఉన్న జనాభా ఇపుడు కేవలం 10834 , మహాబుబనగర్ లో ఏడు మండలాలలో ఉన్న జనాభా 10406 , అంటే అత్యధిక జనాభా ఉన్నది ఇక్కడనే. అప్పటినుంచి చెంచుల పరిస్తితి ఒక్కసారిగా మారింది, అడవిలో కలిసిపోయి, అడవి తల్లిని నమ్ముకున్న ప్రాణాలు ఒక్కసారిగా అడవికి దూరం చేయబడ్డాయి, చెంచులు ముక్యంగా ఆహారం సేకరించే ఆదివాసీలు, వీరికి అడవి తేనే తీయడం, దుంపలు, బంక, చింతపండు,కుంకుడుకాయలు, మొదలగునవి సేకరించడం మాత్రమె తెలుసు, బయటి ప్రపంచంతో సంబందాలు చాల తక్కువ, పులుల సంరక్షణ పేరుతొ, ఎకో టూరిసం లాంటి పేర్లతో వీరిని, అడవి పులులుగా బతుకుతున్న వీరిని కూలీలుగా మార్చి వేసినాయి.
గత వారం డాక్టర్ రామకృష్ణ(చెంచులకోసం గత కొద్ది సంవత్సరాలుగా పనిచేస్తున్నారు) , విజయభాస్కర్ (ఆదివాసిల పై పని చేస్తూన్నకార్యకర్త ) లతో మహాబుబనగర్ అప్పపూర్ కు వెళ్ళడం జరిగింది. వీరు అటవీ హక్కుల చట్టం క్రింద చెంచు హక్కులను కాపాడడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నారు. చలికి చెంచులు చని పోయే పరిస్తితి ఉంది అని చెప్పడంతో ఇక్కడ, బయట దేశంలో ఉన్న మిత్రులం కలిసి దాదాపు నలుగు వందల ఉలెన్ దుప్పట్లు తీసుకొని పోవడం జరిగింది. ఇపుడు అప్పపూర్ క్రింద ఉన్న చెంచు పెంటలు జనాభా దాదాపుగా ఆరు వందలు ఉండవచ్చు. ఇక్కడి ప్రాంత ఆదివాసిలను చూసాక, ఇక్కడ ప్రబుత్వం, సబ్య సమాజం, భాద్యత గల సంస్తలు ఏమాత్రమైన వీరి గురించి ఆలోచిస్తున్నాయ అని అనుమానం కలిగింది, అవును అందరం ప్రబుత్వం మీద వదిలివేస్తే ఏమవుతుంది మరి? ఆదివాసీలు ఎందుకు మన చరిత్రలో భాగం కారు? నేడు ఉవ్వెత్తున ఎగసి పడుతున్న తెలంగాణా ఉద్యమంలో వీరి అధ్యాయం, వీరి భాగస్వామ్యం , హక్కులు ఎవరు మాట్లడరెండుకో? అక్కడికి పోవడానికి ఈ నాటికి సరి అయినా దారి లేదు, వొక్కరి మొహాల్లో కూడ కొద్దిగా ప్రసాంతత లేదు, ఎందరో చావుకు ఎదురు చూస్తూ, నిరాశా నిస్పృహలతో ఆకలికి అలమటిస్తూ, అనారోగ్యంతో బాద పడుతూ కనిపించారు, కనీస నీటి వసతి లేదు, కారణాలు వెతికితే అనేకం. అక్కడ నక్సల్ భయంతో ఆఫీసర్లు రారు, సరి అయిన , సరి పడే సిబ్బంది లేరు, పోవడానికి ఎవరు సిద్దంగా లేరు, పోయే వారు స్వచ్చంద సంస్తలు కాకపొతే వారు తప్పకుండా నక్సల్ అయి ఉంటారు అని అనుమానం, జి వో లు , ఎన్ జి వోలు , మావోలు, ఈ ముగ్గురు మాత్రమె ప్రబుత్వ లేక్ఖల్లో ఉంటారు, మానవత్వం ఉన్న వారు, మచ్చలేని వారిని మావోలు అంటే, మామూలు వాళ్ళందరూ కూడ ఆ కోవలోకే వస్తారేమో. అన్ని ఉంటె, ఐ టి డి ఏ దగ్గర డబ్బులు ‘ఆదివాసిలకి’ మాత్రమె లేవు. అక్కడ ఎపుడు చెంచులకి సంబందించిన అధికారులు కాని, పని చేసే వారు కాని ఉండరు, ఎక్కడ అమాయకత్వం ఉంటుందో అక్కడ దోపిడీ యదేచ్చగా జరుగును.
పచ్చగా నేల , సెలయేళ్ళతో గల గల లాడే నీటి చప్పుడు నేడు ఎందుకు లేవు? ఆదివాసిలంటే విల్లంబుల తో బలిష్టంగా కండలు తిరిగే అవయవ సౌష్టవంతో నేడు ఎందుకు కనిపించడం లేదు? చెంచు లక్ష్మి లాంటి అందమైన స్త్రీలు ఎందుకు కరువైయ్యారు? ఇప్పటికి ఇక్కడ స్త్రీలు అనేక ఆరోగ్య సమస్యలతో ఉన్నారు, ముద్దుగా, బొద్దుగా చిన్న పిల్లలు ఎందు లేరు? ఒక్క సారి అక్కడి పిల్లలను చూస్తె ఎవరైనా చలించక మానరు. స్వతంత్రం సంపాదించుకున్న తరువాత పెరగ వలసిన జనాభా ఎందుకు తగ్గి పోతుందీ? ఇందులో దాగి ఉన్న జాతీయ , అంతర్జాతీయ కుట్రలు ఎందుకు దాయ బడుతున్నాయి? ఒక వైపు క్లైమేట్ చేంజ్ అంటూనే, అడవులని, గుట్టలని ద్వంసం చేస్తూన్న ప్రబుత్వ విధానాల పాలసీ ఎవరికీ అర్థం అయితుంది, దైవ భాష అవసరమా?
అప్పపూర్ క్రింద రాంపూర్, జూర పూర్, పుల్లయపల్లి, ఆగర్ల పెంట, ఈర్ల పెంట, మేదిమల్కల, సంగిది గుండాల, లింగ భేరి, యమల పాయ వాగు, దోగాల పెంట, ప్రహబాద్, మల్లాపూర్ ఊర్లు ఉన్నాయి. ప్రజలు కనీస వసతులు లేక, బతకడానికి ఒక చోటు నుండి మరొక చోటికి పోతూ ఉంటారు. ముక్యంగా నీటి వసతి ఏర్పాటు చేస్తే వీరి వలసలని తప్పకుండ ఆపగలరు. వలసలకి పేరు గాంచిన మహాబుబనగర్, ఇక్కడ ఉన్న అడవిలో కల బావులు, చెరువులు పూడిక తీస్తే , ముక్యంగా మేడిమలకల పాత చెరువు, ఫర్హబాద్ పిచ్చికుంట్ల వాగు, బావ్రంపూర్ బావ్రమ్మ చెరువు, రాంపూర్ పాట కుంట లాంటివి బాగు చేసుకుంటే, ఇక్కడ చిన్న చిన్న పంటలు, పండ్లు, కూరగాయలు, పిల్లలకి , ఇంటి అవసరాలకి నీరు సమకూరుస్తే అనేక ఆరోగ్య సమస్యలు దూరమైతాయి. వలస కూలీలకి కూడ తమ ప్రాంతం లో బాగు చేసుకున్న ఫలితం దక్కుతుంది. ఇక్కడ ఎలాంటి సమాచార వ్యవస్థ కూడ నేటికి లేదు, కరెంట్ సౌకర్యం లేదు, వాళ్ళో వీల్లో సోలార్ దీపాలు ఇస్తున్నా కూడ ఎక్కువ కాలం పని చేకుండా పోవడంతో పిల్లలకి, పెద్దలు కూడా ఇబ్బందుల పాలు అవుతున్నారు.
రిసర్వ్ ప్రాంతంలో ఉన్న చెంచుల బాగు కోసం ఐ టి డి ఏ(integrated tribal development agency) , జి సి సి, (girijana co operative society) ఎఫ్ డి (forest department) పని చేయడానికి ఉన్నాయి, వీరి కోసం శ్రీశైలం లో ఐ టి డి ఏ ఏర్పరచారు. అయితే ఇక్కడ ఎటువంటి విద్య, వైద్య, సౌకర్యాలు కాని సరిగా లేవు, చెంచులు సేకరించిన అటవీ ఉత్పత్తులు జి సి సి లో ఇస్తే గాని వారికి సరి ఐన తిండి దొరక కుండా చేసారు, ఇక్కడ కేవలం వారానికి ఒక రోజు మాత్రమె ఈ జి సి సి ఉంటుంది, అసలు ఈ జి సి సి విలువైన అటవీ ఉత్పత్తులకి సరి ఐన మూల్యం చెల్లిస్తుంద? అదో పెద్ద అర్థం కాని ప్రశ్న నేటికి కూడ.. టైగర్ రిసర్వ్ ‘పులుల’ కోసమా లేక మైనింగ్ మాఫియ కోసమా అని ఇపుడు అందరికి అనుమానం కలుగుతుంది. పులులు కేవలం నల్లమల లోనే కాకుండా అనేక ప్రాంతాలలో ఉన్నాయి, కరీంనగర్, ఆదిలాబాద్ లాంటి ప్రాంతాలలో అనేక వన్య ప్రాణులు గ్రానైట్, ఓపెన్ కాస్ట్ మైనింగ్ లకి బలి అవుతున్నాయని ఫారెస్ట్ అధికారులే చెపుతున్నారు, అక్కడ లేని ప్రేమ ఇక్కడ ఎందుకు? వన్య ప్రాణులు ప్రతి గుట్ట మీద ఉన్నాయని మొర పెట్టుకుంటుంటే పట్టించుకోని ప్రభుత్వాలు ఈ కపట ప్రేమ నెందుకు ప్రదర్సిస్తున్నట్టు?
ఇట్లా చెప్పుకుంటూ పొతే ఎన్నో, ఎన్నెన్నో..ఇపుడు మనం ఎం చేయాలి? దయ చేసి ఎందుకు చేయాలి అని అడగ కండి.. సమాజం లో ఏ ఒక్కరు మన క్రింది స్తాయి లో ఉన్నా, వారికి మనం చేయూత ఇవ్వడం మన బాద్యత, అందునా అన్యం పుణ్యం ఎరుగని వారు, చదువుకున్న, స్వార్థ పరులకి బలి అవుతుంటే మనమందరం వారికి తోడుగా ఉండాలి. ఈ ఆదిమ జాతులు మన ప్రాంతానికి, ఏ ప్రాంతానికి అయినా ఒక అమూల్య సంపద లాంటి వారు, వీరినుండి మనం నేర్చుకోనేవి ఎన్నో విషయాలు ఉన్నవి, మరుగున పడిన, మనం మరిచి పోయిన మనవ విలువలు కోకొల్లలు, వారొక గొప్ప సంస్కృతీ కి చిహ్నాలు, ఎంతో మంది ఉద్యమ కారులు కష్టపడి అడవులని, ఆదివాసిలని రక్షించడానికి అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చారు. వీరి దాక వాటిని తీసుకుని పోయే బాద్యత మనదే.
ప్రస్తుతం చెంచుల కి మనం అందరం కలిసి అటవీ హక్కుల ప్రకారం వారి హక్కులు దక్కేలా చూడాలి. చెంచు రిసర్వ్ వారికి దక్కేలా అంటే (దాదాపు ఒక లక్ష ఎకరాలు) వారికి ఇవ్వాలని హైమన్ డార్ఫ్ అనే మనవ శాస్త్ర వేత్త 1941 సంవత్సరంలో ప్రతిపాదించారు. నిజాం ప్రిన్సిలి స్టేట్ గవర్నమెంట్ 01-03-1942 లో నల్లమల చెంచు ప్రాంతం వారికే చెందుతుందని డిక్లేర్ చేసారు. ఈ హక్కులతో చెంచులు వారికి కావలసిన రీతిలో వారు వారి అభివ్రుధిని నిర్వచించు కోవచ్చు. ప్రస్తుతం అనేక సంస్తలు నల్లమలలో చెంచుల కోసం పని చేస్తున్నాయని చెపుతున్నాయి, వారు చేస్తూన్న పనులు, వారు తెచ్చుకుంటున్న నిధులు చెంచుల కు తెలియ చెప్పాలి, అక్కడి అధికారులకి, ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు చూడాలి, నేడు కార్పొరేటు ‘ఘనులు’ స్వచ్చంద సంస్థల రూపంలో రావడం సర్వ సాధారణం అయి పోయింది, ఇన్ని సంస్థలు ఉంటె చెంచుల జీవితాలు ఎందుకు మెరుగు కావడం లేదో వారు కూడ సమాధానం చెప్పాలి. సంబందిత జిల్లా శాఖ అధికారులు, అడవిలో ఉన్న ఈ అమాయక ప్రాణులను , జంతువులతో పాటు కాపాడ వలసినది గా వారు కోరుతున్నారు. మరొక విచిత్ర మైన విషయం ఏమిటంటే, నక్సల్ ఇక్కడ లేరు అని ప్రకటించుకున్న ప్రభుత్వాలు ఎందుకు వీరిని హిమ్సిస్తున్నాయో వివరించాలి. రాలి పోతున్న ప్రతి ప్రాణానికి మనమందరం బాద్యత వహించాలి. డాబర్, దేబియర్స్ లాంటి కంపనీలు ఇక్కడికి రాకుండా చూసుకోవాల్సిన బాద్యత ఎవరు తీసుకుంటారు? తీసుకొని వారు సమాజంలో భాగస్వాములు ఎలా ఎయితారు? ప్రశ్నలతో ముగిస్తున్నాను, కొన్ని సమాధానాలతో మీ అందరి సహకారం ఆశిస్తున్నాను. మన నల్లమలని, మన చెంచులని, మన వన్య ప్రానులని కాపాడుకుందాం! రేపటి ఆదివాసి తెలంగాణా, ఆదివాసి రాయల సీమ, ఆదివాసి ఆంద్ర కోసం ఉద్యమిద్దాం!