Pages

Friday, 23 August 2013


 నల్లమలలో నమస్తేఆంధ్ర …2 Source : http://www.namastheamerica.com/?p=14360

శ్రీశైలం – హైదరాబాద్ రహదారిలో మన్ననూరు చెక్ పోైస్టు దాటాక 15 కిలోమీటర్లు నల్లమల అడవిలో ప్రయాణిస్తే ఫరహాబాద్ వ్యూపాయింట్ కు వెళ్లే చోట చెక్ పోస్ట్. అక్కడి నుండి అడవిలోకి 18 కిలోమీటర్లు ప్రయాణిస్తే అప్పాపూర్ పెంట. ఈ అడవిలో ఉన్న పెంటలన్నింటికి ఇదే పెద్దన్న. ఈ పెంట చుట్టూ 20 పెంటలకు అప్పాపూర్ ప్రధాన కేంద్రం.
అయితే దీని చుట్టూ ఉన్న పెంటలలో లింగంబెర్రి పెంట, కడ్తిబోడు పెంట, ధారవాగు పెంట, జీవగుండం, బల్జీరాం పెంట, గోకరాగు, పంది మర్రి పెంట, రాయలేటి పెంటలు ఇప్పుడు మాయమయ్యాయి. సరైన వైద్య సదుపాయాలు అందక వ్యాధుల బారిన పడిన చెంచులు క్రమంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో అక్కడ మిగిలిన వారు ఇతర పెంటలకు తరలిపోయారు. 
ఇప్పడు అడవిలో సంగిడి గుండాల, భౌరాపురం, ఫరహాబాద్, పుల్లాయపల్లి, మల్లాపూర్, రాంపురం, అప్పాపూర్, మేడిమల్కల, ఈర్లపెంట, ఆగర్ల పెంట, తాటిగుండాల, ఏములపాయ వాగు పెంటలే ఇప్పుడు మిగిలాయి. ప్రతి పెంటకు నాలుగు నుండి పది చెంచు కుటుంబాలు ఉంటాయి. వ్యాధుల బారిన పడి ఒక్కొక్కరు మరణించగానే మిగిలిన వారు వేరే పెంటలకు వెళ్తున్నారు. అయితే అప్పాపూర్ లో మాత్రం అన్నింటి కంటే ఎక్కువగా 70 కుటుంబాల వరకు ఉండేవి. ఇప్పుడు అక్కడ కూడా 50 కుటుంబాల లోపే మిగిలారు. ఇళ్లున్నా చాలామంది బయటకు వలస వెళ్లారు.
నల్లమలలో నక్సల్స్ ఉన్పప్పుడు వారికి చెంచులు సహకారం అందిస్తున్నారన్న నెపంతో అప్పాపూర్ చుట్టూ ఉన్న పెంటల చెంచులను పోలీసులు బలవంతంగా అప్పాపూర్ కు రప్పించారు. దీంతో వారికి జీవనం కష్టంగా మారింది. ఆ విధంగా కూడా కొంత మంది తరలిపోగా, మరికొందరు అనారోగ్యంతో చనిపోయారు. నక్సల్స్ భయంతో వైద్యసదుపాయాలు కూడా చెంచులకు తక్కువగానే అందేవి. దీంతో ఎక్కువమంది టీబీ, మలేరియా వ్యాధులతో మరణించారు.
అప్పాపూర్ లోనే  ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల, గిరిజన సహకార డిపో. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం  ఇక్కడ ఉన్నాయి.  అడవిలో చెంచులు సేకరించే తేనె, గోందు (gum), కుంకుడు కాయలు, చింతపండు తదితర అటవీ సంపదను  ప్రతి గురువారం అప్పాపూర్ లోని గిరిజన డిపోకుతీసుకువస్తారు. అక్కడ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు సేకరించిన వాటిని అమ్మి తమకు అవసరం ఉన్న బియ్యం, పప్పు, సబ్బులు, బెల్లం, పుట్నాలు తీసుకుంటారు. నిత్యావసరాలు తీసుకోగా అదనంగా వచ్చే డబ్బును చెంచులు నగదు రూపంలో తీసుకుంటారు.
అయితే ఇక్కడ ఆశ్రమ పాఠశాల ఉన్నా లేనట్లే. ఇక గతంలో ఇక్కడ ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రతి బుధవారం పనిచేసేది. ఏడాది క్రితం దానిని కూడా ఇక్కడి నుండి తరలించి శ్రీశైలం రహదారిలో ఉన్న వటువర్లపల్లికి తరలించారు. దానికి అక్కడ పక్కా భవనం కూడా నిర్మాణమవుతోంది. అడవిలోకి వెళ్లడం కష్టమవుతుందని తాత్కాలికంగా తరలిస్తున్నట్లు చెప్పి అప్పట్లో వటువర్ల పల్లికి తీసుకెళ్లిన ఆసుపత్రి మళ్లీ అప్పాపూర్ కు వచ్చే పరిస్థితి లేదు. సరిగ్గా పది రోజుల క్రితం మల్లాపూర్ పెంటకు వచ్చిన జిల్లా కలెక్టర్ ను చెంచులు అప్పాపూర్ ఆసుపత్రి గురించి అడిగారు. కానీ ఎలాంటి హామీ వారికి రాలేదు. ఇప్పుడు ఆ కలెక్టర్ కూడా పదవీ విరమణ చేశారు. చెంచులకు అనారోగ్యంగా ఉన్నప్పుడు మందులు అందించేందుకు ప్రతి చెంచు పెంటకు ఓ మహిళా కమ్యూనిటీ హెల్త్ వర్కర్ ను నియమించారు.
వారి వద్ద మలేరియా, కడుపునొప్పి, జ్వరం, వాంతులు, విరేచనాలు వంటి వ్యాధులకు మందులు ఉంచుతున్నారు. ప్రతి బుధవారం ఓ వాహనంలో ఇక్కడికి వచ్చి వైద్యం అందిస్తున్నారు. ఇక్కడి 108 రాదు. అత్యవసర వైద్యం కోసం వెళ్లాలంటే 50 కిలోమీటర్ల దూరంలోని అచ్చంపేట పట్టణమే గతి. అప్పుడప్పుడు స్వచ్చంధ సంస్థలు నిర్వహించే మెడికల్ క్యాంపులే చెంచులకు ఆధారం. కాకపోతే గతంతో పోలిస్తే ఇప్పుడు మలేరియా వ్యాధి కారణంగాచనిపోయే చెంచులు లేరు. ఆసుపత్రి ఇక్కడి నుండి ఏకంగా తరలిపోగా, ఆశ్రమ పాఠశాల వారికి ఉన్నాలేనట్లే. ఇక ఇక్కడ చెంచులకు అవసరం వస్తున్నది ఒక్క గిరిజన సహకార డిపో మాత్రమే.
ఆశ్రమ పాఠశాలను సరిగ్గా నిర్వహిస్తే దాదాపు 60 మంది పిల్లలు అక్కడే ఉండి చదువుకోగలుగుతారు. కానీ అసలు ఇక్కడికి ఉపాధ్యాయులు రావడమే మానేశారు. అక్కడ వంట చేసేవారికి సరుకులు మాత్రం పంపి పాఠశాల నిర్వహించకుండా తప్పుకుంటున్నారు. గత విద్యా సంవత్సరంలో అప్పాపూర్ చెంచులు కొందరు పాఠశాలకు రావడంలేదని ఉపాధ్యాయులను ప్రశ్నిస్తే వారి మీదే ఉపాధ్యాయులు కేసుపెట్టారట. దీంతో భయపడ్డ చెంచులు కనీసం పాఠశాల వైపు చూడడమే మానేశామని వారు వాపోయారు.
అప్పాపూర్ పెంట కు మాత్రం ప్రభుత్వ సోలార్ విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసింది. తాగునీరు, ఇతర అవసరాలకోసం ఓ బోరు దానికి విద్యుత్ కోసం జనరేటర్ ఏర్పాటు చేసింది.  ఇక ప్రతి పెంటకు ఓ సోలార్ లైట్ మాత్రం ఇచ్చారు. తాగునీరు కావాలంటే అడవిలోని చెరువులు, చెలిమెల మీదే ఆధారపడాలి. అడవిలోని జంతువులు, చెంచులకు ఈ నీరే ఆధారం. దీంతో చెంచులు వ్యాధుల బారిన పడుతున్నారు. గతంలో ఐటీడీఏ నుండి ఓ సంచార వైద్యవాహనం ఉండేది. ఇప్పుడు అది కూడా రావడం లేదు.
ప్రభుత్వం పథకాలు ఎన్ని పెట్టినా అవి క్షేత్ర స్థాయిలో చెంచులకు అందించడంలో పూర్తిగా విఫలమవుతోంది. అందుకే గిరిపుత్రులకు అడుగడుగునా గండాలు ఎదురవుతున్నాయి. పథకాలను ఆచరణలో అమలు చేస్తేనే చెంచుల పరిస్థితి మెరుగవుతుంది.
సశేషం..

No comments:

Post a Comment