Pages

Thursday, 15 August 2013

Home

ప్రభుత్వ విద్య బాగుపడేదెన్నడు?

  • - గడీల సుధాకర్‌రెడ్డి
  •  
  • 15/08/2013
ప్రపంచీకరణ, ఆర్థిక సరళీకరణ, ప్రైవేటీకరణ ప్రతి మనిషిలో ఆర్థిక పరమైన స్వార్థాన్ని పెంచి పోషిస్తూ రావడంవలన నేడు అత్యధికులు ‘ఆర్థిక సాలెగూళ్ల’లో చిక్కుకొని తన విధిని, కర్తవ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆర్థికమే సర్వస్వంగా భావిస్తూ ఆర్థికంగా ఎదగడానికి అడ్డదారులు వెదుకుతున్నారు. అందులో కొందరు ఉపాధ్యాయులుండడం సమాజానికి తీరని నష్టం. సమసమాజ నిర్మాత, జాతి నిర్మాతలుగా పేరుగాంచిన ఉపాధ్యాయులు ఆర్థిక స్వలాభంకై అర్రులు చాచడం శోచనీయం. వ్యాపార రాజకీయులకు విద్యావ్యవస్థ ఎటుబోయినా పట్టింపు లేదు. పాలక, ప్రతిపక్షాలకు విద్యారంగంపై ముఖ్యంగా ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యపై చిత్తశుద్ధి లేకపోవడంవలన ఇప్పుడు స్వార్ధపర ఉపాధ్యాయులు పాఠశాల విద్యపై అజమాయిషీ వహిస్తున్నారు.
వీరికి అసలైన అంకితభావంగల ఉపాధ్యాయులంటే అసలే గిట్టదు. ఏ ఎండకాగొడుగుపట్టడమే వీరి ప్రధానాయుధం. గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల పేద విద్యార్థుల పాలిటి శాపంగా మారిన వీరి ఆగడాలు చెప్పరానివి. విద్యాధికారుల ఫలితాల జపం వీరికి వరం కావడంవలన అసలు విద్యాసారంకై పనిచేయవలసిన ఆవశ్యకత లేకుండా బోయి వార్షిక పరీక్షల్లో ఆఖరి క్షణం లోనైనా ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు సమాధానాలందించి అడిగిన ఫలితాలందించడం గత 15 సంవత్సరాలుగా ఆనవాయితీగా మార్చేసి, నామ్‌కే వాస్తే బోధన చేస్తున్నారు. కొందరైతే బోధన చేస్తున్నట్టు నటిస్తూ, నయవంచనలో కళాప్రపూర్ణలుగా పేరుగాంచుడూ విద్యాద్రోహులుగా మారుతున్నారు.
పాఠశాలేతర సమయంలో ఒక్క క్షణం కూడా విద్య గురించి, తమ పాఠశాల విద్యార్థుల గురించి ఆలోచించని ఉపాధ్యాయులే ఇప్పుడు ఎక్కువ. అలాంటి కొందరు ఉపాధ్యాయులు తమ సంతానానికి 8వ తరగతి నుండే లక్షల రూపాయలు కార్పొరేటు కాలేజీల్లో చెల్లిస్తూ బందీలుగా మారుస్తూ సమాజాన్ని తప్పుతోవ పట్టిస్తున్నారు. తాము బోధించే పాఠశాలలోని విద్యార్థుల విద్యాపరమైన వెనుకబాటుతనాన్ని తొలగించడానికి ఏ ఒక్క క్షణం కేటాయించని ఉపాధ్యాయులు పట్టణాలలో, నగరాలలో నడి రోడ్డు కూడళ్లలో గంటలు, గంటలు నిష్క్రయాపరత్వంతో శుష్క మాటలతో కా లం వెళ్లదీస్తూ సమాజ ఏహ్యభావనకు గురిఅయినా పట్టించుకోరు.
ఆధునిక ఉపాధ్యాయుల్లో మేధా సంపత్తి ఉన్నవారు చాలామందే ఉన్నారు. అవసరమైతే వీరు విద్యార్థులను మెరికలుగా తీర్చిదిద్దగలరు. కానీ పనిచేయని, అనవసర రాజకీయాలు, బయట వ్యవహారాల్లో తలమునకలుగా ఉండే కొందరు అటువంటి టీచర్లను ముందుకు వెళ్ళనీయరు. ఎందుకంటే వారి సమర్థత బయటపడి, తమ అసమర్ధత, నిర్లక్ష్యవైఖరి, బయటి వ్యవహారాలు బయటపడతాయని అనుక్షణం భయం వెంటాడుతుంటుంది. అటువంటి వారు సహజంగా బలమైన యూనియన్లలో సభ్యులుగా కొనసాగుతారు. సంఘాలు కూడా తమకు ఎక్కువ మంది టీచర్ల మద్దతు కావాలంటే, సాధ్యమైనంత ఎక్కువమందిని సభ్యులుగా తీసుకొని ఎన్నికల్లో గెలవాలన్న కాంక్షేకాని, విద్యార్థులను గురించి పట్టించుకోవడం అసలు జరగనే జరగదు. రాజకీయాలు రాజ్యమేలే అయ్యవార్ల ప్రపంచంలో, విద్య కొడిగట్టిన దీపంగానే మిగిలిపోతున్నది. తమకు భుక్తినిస్తున్న విద్యారంగంపైనే నిర్లక్ష్య వైఖరి అవలంబించే కుసంస్కృతి బాగా విస్తరిస్తోంది.
అయతే ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. కార్పొరేట్ స్కూళ్ళు కళాశాలల్లో టీచర్లు, అధ్యాపకులు మంచి ఫలితాలు సాధించడానికి కారణం, అక్కడ ఉద్యోగ భద్రత లేదు. సమర్ధతను, టాలెంట్‌ను చూపితేనే ఉద్యోగం నిలుస్తుంది. సంఘాల బెడద లేదు. మరి ఈ లక్షణాలు ప్రభుత్వ పాఠశాలలకున్నాయా? ఉంటే అవి తప్పక బాగుపడతాయ.

No comments:

Post a Comment