Pages

Monday, 19 August 2013



www.suryaa.com/index.asp

విద్యా హక్కు చట్టం స్థానిక సంస్థల బాధ్యత
‘నిరక్షరాస్యత దేశానికి అతి పెద్ద కళంకం.. దాన్ని విధిగా తొలగించి తీరాలి’ అన్న బాపూజీ మాటలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరిచి పోకూడదు. అందరికీ విద్యనందించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రభుత్వాలకు ఉన్నది. విద్య అంశం ఉమ్మడి జాబితాలో ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నూరు శాతం అక్షరాస్యత అందించాల్సి ఉన్నా, ప్రభుత్వాలకు అది సాధ్యం కాలేక పోవడం విచారకరం. గత 50 సంవత్సరాల నుంచి సంపూర్ణ అక్షరాస్యత సాధన కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ, అక్షరాస్యత 60 శాతం మించడం లేదు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే, మన రాష్ట్రం 28వ స్థానంలో, అంటే అట్టడుగు స్థానంలో ఉంది.

అందరికీ విద్య అందించేందుకు కేంద్ర ప్రభుత్వం విద్యా హక్కు (ఆర్‌.టి.ఇ) చట్టానికి పురుడు పోసింది. 2009 ఆగస్టు 26న రాష్టప్రతి ఆమోదంతో, 2010 ఏప్రిల్‌ 1 నుంచి దేశ వ్యాప్తంగా ఈ చట్టం అమల్లోకి వచ్చింది. 2010 విద్యా సంవత్సరంలో దీనిని పూర్తి స్థాయిలో అమలు చేయకపోయినప్పటికీ.. విద్యాహక్కు చట్టంలో అంశాల మేరకు రాష్ట్రాల విద్యావసరాలకు అనుగుణంగా నాలుగు జీవోల ద్వారా మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ చట్టం అమలుకు ఒక్కో రాష్ట్రానికి దాదాపు రూ. 4 వేల కోట్లను కేంద్రం కేటాయించింది. నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా- 1:30 నిష్పత్తి ప్రకారం టీచర్లు: విద్యార్థులు ఉండాలని ఈ జీవోలు స్పష్టం చేశాయి.

ప్రతి పాఠశాలలో విద్యాబోధన చేసే వారు డిఎడ్‌, లేదా బిఎడ్‌ కోర్సు పూర్తి చేయడంతో పాటు, ఎన్‌సిటిఈ నిర్వహించే టీచర్‌ అర్హత పరీక్ష (టెట్‌)లో అర్హత సాధించాలి. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు కూడా టెట్‌ అర్హత ఉండాలి. విద్యా హక్కు చట్టం అమలులో స్థానిక సంస్థలకే అధిక బాధ్యతలున్నాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 45 ప్రకారం 6-14 ఏళ్ళ బాల బాలికలకు ఉచిత నిర్బంధ విద్య అందించాలని ఆర్‌.టి.ఇ. నిర్దేశిస్తోంది. ఇది సామాజిక బాధ్యత. అలాగే, ఆర్టికల్‌ 51ఎ (ఆర్‌) ప్రకారం 6-14 లోపు బాలలకు విద్యావకాశాలు కల్పించడం తల్లి తండ్రుల ప్రాథమిక విధి. 86 వ ర్యాజ్యాంగ సవరణ చట్టం- 2002 ప్రకారం 21 (ఎ) విద్య ప్రాథమిక హక్కు.

73వ రాజ్యాంగ సవరణ ప్రకారం, పాఠశాల విద్యాశాఖ నియంత్రణలోఉన్న అన్ని పాఠశాలలకు చెందిన అన్ని అంశాలకు సంబంధించిన అధికారాలు, బాధ్యతలను పంచాయతీ రాజ్‌ సంస్థలకు బదలాయించారు. కాబట్టి విద్యా హక్కు చట్టంలో భాగంగా ప్రాథమిక విద్యను గ్రామీణ ప్రాంతాలోని అన్నివర్గాల ప్రజలకు అందించడం స్థానిక సంస్థల బాధ్యత. ఇందులో భాగంగా.. ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో పంచాయతీ విద్యా ఉపకమిటీలను గ్రామ సర్పంచ్‌ అధ్యక్షతన ఏర్పాటు చేయాలి. ఈ ఉప కమిటీలలో మహిళా వార్డు సభ్యులలో ఒకరు వైస్‌ ఛైర్మన్‌గా, ఇంకొకరు సభ్యులుగా, షెడ్యూల్‌ కులాలు లేదా షెడ్యూల్‌ తెగలు లేదా వెనకబడిన తరగతులకు సంబంధించి ఇద్దరు సభ్యులుగా కమిటీలలో ఉండి తీరాలి. ఉప కమిటీలు గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని పాఠశాలల పనితీరును సమీక్షించాలి.

పాఠశాల సిబ్బంది రోజు వారీ హజరు పరిశీలించాలి. పిల్లల విద్యాప్రమాణాలపై దృష్టి సారించాలి. పాఠశాలల్లో మౌలిక వసతి సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. మధ్యాహ్నభోజన పథకం సక్రమంగా అమలవుతున్నదో లేదో పర్యవేక్షించే అధికారం ఈ కమిటీకి ఉంటుంది. పాఠ్యపుస్తకాల సరఫరాను పరిశీలించాలి. ఉపాధ్యాయులు బడి వేళలు పాటిస్తున్నారా, పాఠశాలల్లో అమలవుతున్న కార్యాక్రమాలు తీరు ఎలా ఉన్నది, పాఠశాల ఫర్నిచర్‌, లైబ్రరీ- పుస్తకాలు, ప్రయోగశాలలు- పరికరాలు సరిగా ఉన్నాయా లేదా అనే అంశాలపై నివేదికలను ఉన్నతాధికారులకు అదించాలి.

ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణకు అవసరమైన వెలుతురు, అల్పాహరం వంటి ఏర్పాట్లు గ్రామపంచాయతీ సహకారంతో అందించాలి. విద్యా సంబంధ విషయాలను చర్చించడానికి ప్రతి శనివారం ఉప కమిటీ సమావేశం కావాలి. ఈ సమావేశానికి గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఇద్దరు లేదా ముగ్గురు సీనియర్‌ ఉపాధ్యాయులు పాల్గొనాలి.ప్రాథమిక విద్య స్థానిక సంస్థల పరిధిలోకి వచ్చినప్పటికీ గ్రామాలలో విద్య నేటికీ అటెకెక్కిన చందంగానే ఉన్నది. గ్రామ పంచాయతీల పరిధిలో ఉప కమిటీలు ఏర్పాటు కావడం లేదు. దీనిని జిల్లా విద్యాధికారులు, మండల విద్యాధికారులు, సర్వ శిక్ష అభియాన్‌(ఆర్‌విఎం) జిల్లా ప్రాజెక్ట్‌ అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రాథమిక విద్యాభివృద్ధికి కేంద్రం కోట్లాది రూపాయలు గుమ్మరి స్తున్నప్పటికీ విద్యాభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నది. గ్రామాల వారీగా చూస్తే విద్యాభివృద్ధి శూన్యం. పలువురు అధికారులు కాకి లెక్కలకే పరిమితం అవుతున్నారు తప్ప చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదు.

ఇప్పటికైనా మునిగిపోయింది లేదు. ఇకనైనా స్థానిక సంస్థలు కళ్ళు తెరవాలి. గ్రామాలలో గుణాత్మక విద్య అందించడానికి కృషి చేయాలి. సమాజాన్ని మార్చే శక్తి విద్యకు ఉన్నప్పుడు దానిని పిల్లలందరికీ అందేటట్లు చర్యలు తీసుకోవాలి. కాని ఆ పనులు చాలా మందకొడిగా సాగుతున్నాయి. ప్రభుత్వ కార్యక్ర మాల అమలుతో పాటు గ్రామ పంచాయతీలు తమ పిల్లలకు మెరుగైన జీవితాన్ని కల్పించడానికి చర్యలు తీసుకోవాలి. ఇందులో రాజకీయాలకు ఆస్కారం ఇవ్వకూడదు. ప్రతి సంవత్సరం తయారు చేసే పాఠశా ల విద్యాప్రణాళికల అమలులో గ్రామ పంచాయతీలు తోడ్పాటునందించాలి. గ్రామీణాభివృద్ధిలో విద్య కూడా భాగమే. పాఠశాల, అంగన్‌వాడీ పిల్లలకు గుణాత్మక విద్యనందించేందుకు సహకరించాలి. విద్యా హక్కు చట్టం అమలులో స్థానిక సంస్థలు ప్రధాన పాత్ర పోషించినప్పుడే ఈ లక్ష్యం నెరవేరుతుంది.
- సురేష్‌ బాబు బొర్రా

No comments:

Post a Comment