
క్షయబారిన చెంచులు 9th October 2012 , Andhra Prabha
బ్రతుకు బండి ఈడ్వలేని కొందరు చెంచులు తమ పిల్లల్ని ప్రభుత్వం వారి ఆశ్రమ పాఠశాలల్లో చేర్పించి తమ బాధ్యతలు తీరిపోయాయని చేతులు దులుపుకొంటూన్నారు. వీరిలో దుర్భర జీవితాన్ని వెళ్లదీస్తున్న కుటుంబాలే అధికంగా ఉన్నాయి.
చెంచు కుటుంబాలలో గత అయిదేళ్ల కాలంలో సుమారు నాల్గు వందలమంది దాకా కేవలం క్షయవ్యాధికి గురై చనిపోయినట్లు తెలుస్తుంది. ఒక్క క్షయవ్యాధికే ఇంతమంది చనిపోతే మిగతా వ్యాధులకు, మిగతా అనేక కారణాలుగా ఎంతోమంది చెంచుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఈ లెక్కన నల్లమల చెంచుల జనాభా నానాటికీ క్షీణించిపోతోంది. కొల్లాపూర్ తాలూకాలోని నార్లాపూర్ చెంచు గూడెంలోని 60 కుటుంబాలలో 150 మందికి పైగా నివాసముంటున్నారు. వీరిలో క్షయవ్యాధి బారినపడి అసువులు బాసిన వారెందరో! ఇట్లా చనిపోగా మిగిలిన వారిలో కూడా శక్తి లేక, జీవన సమరం సాగించలేక జీవన్మృతులైన వారు మరెందరో! అడవిలోని ఉత్పత్తులు సేకరించుకొని తెచ్చి ప్రభుత్వ సేల్స్ డిపోలో విక్రయించి జీవనం సాగించేవారు బహుకొద్దిమంది మాత్రమే. చాలామంది వలసవెళ్లి బ్రతుకీడ్వలేక, వాతావరణం అనుకూలించక మృతి చెందేవారుకూడా ఉన్నారు.
నల్లమల అడవుల్లో నివసించే చెంచు కుటుంబాల వారికి ప్రభుత్వ వైద్య సదుపాయాలు అందక గూడ చాలామంది మృత్యువాత పడుతున్నారు. జ్వరం మొదలైన రోగాలు వస్తే ప్రభుత్వం వారి ఆసుపత్రులకు నడచి వెళ్లలేక వనమూలికలు, ఆకుపసర్లు, కందమూలాలు మొదలైన వాటితో వచ్చీరాని వైద్య చికిత్సలు చేసుకుంటూ బ్రతికే వారు బ్రతగ్గా చనిపోయే వారు పోతూనే ఉన్నారు. కాబట్టి నల్లమల అడవుల్లోని వీరికి అనుకూలంగా వైద్యశాలలు ఏర్పాటు చేస్తే కొంతైనా మేలుగా ఉంటుంది. అడవుల్లో నివాసముంటూ చెంచులకు వైద్యసేవలు అందించే ప్రభుత్వ సిబ్బంది ఎవరూముందుకు రాకపోవడంతో అనేకమంది చెంచులు రోగాల బారినపడి మృత్యువాత పడుతున్నారు. వీరి కోసం ప్రభుత్వం ఏటా లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా వృధాగా అయిపోతుంది. అమాయకులైన చెంచుల నోళ్లు కొట్టే మధ్య దళారులు కుబేరులైపోతున్నారు. ఈ వ్యవస్థ సమూలంగా మారకపోతే ఇది ఇట్లాగే కొనసాగుతూ పోతే రాబోయే రోజుల్లో నల్లమల అడవుల్లో ఒక్క చెంచు వ్యక్తికూడా మిగలడు. రాబోయే తరాల వారికి వీరిని గురించి కథలుగా చెప్పుకోవడం తప్పిస్తే ప్రత్యక్షంగా చూసేటందుకు అవకాశాలు ఉండవు.
మహబూబ్‌నగర్ జిల్లాలోని నల్లమల అడవుల్లో అమరాబాదు కొల్లాపూర్ ప్రాంతాల్లోని అడవుల్లో చెంచులు అధికంగా ఉన్నారు. వీరు యాసతో తెలుగు భాషలో మాట్లాడుతారు. అక్కడక్కడ ఉర్దు పదాలు కూడా వీరి మాటల్లో చేరుతాయి. వీరు సంచార జీవులు. అడవుల్లోనే ఒక పెంట నుండి మరో పెంటకు మారుతుంటారు. పట్టుమని పది కాలాల పాటు ఒక్కచోట ఉండరు. వీరికి పూర్వం నిజాం ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందుతుండేది. ఆ తర్వాత వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వీరికి ఆర్థికంగా అన్ని సౌకర్యాలు సమకూరుస్తూనే ఉంది. ప్రతి సంవత్సరం వీరిపై ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తోంది. వీరి కోసం ప్రత్యేకంగా వైద్యశాలలు ఏర్పాటు చేశారు. పాఠశాలలు, ఉపాధ్యాయులు మొదలైన సౌకర్యాలు కల్పించారు. వ్యవసాయ భూములను, అరక ఎద్దులను, బండ్లను, వ్యవసాయ పనిముట్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఇంకా వీరికి శాశ్వత ప్రాతిపదికన పక్కాఇండ్లు కట్టించి ఇస్తున్నారు. ఆధునిక వ్యవసాయం గురించి మెళకువలను ప్రభుత్వం నేర్పుతోంది. పండ్ల తోటలు మొదలైన ఆధునిక వ్యవసాయ రంగాల్లో ఉచితంగా శిక్షణ యిస్తున్నారు. డ్రైవింగ్ మొదలైన అనేక వృత్తుల్లో ఉచిత శిక్షణ యిస్తూ సొంతంగా జీవించేటందుకు అనువైన అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తోంది. వీరి జీవనోపాధి కొరకు అనేక పథకాలను సిద్ధపరచి వీరి అభివృద్ధి కోసం అహర్నిశలు ప్రభుత్వం మిక్కిలి శ్రద్ధ వహిస్తోంది. అడవుల్లో అక్కడక్కడ గిరిజన సహకార సంస్థ వారి ఆధ్వర్యంలో సేల్స్ డిపోలు ఏర్పాటు చేసి వీరికి కావలసిన నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నారు. అడవుల్లోని ఉత్పత్తులను చెంచులు సేకరించుకొని వచ్చి ఈ సేల్స్ డిపోల్లో విక్రయించి ఆ డబ్బుతో అదే సేల్స్ డిపోల నుండి నిత్యావసర సరకులను తీసుకొనిపోతారు.
వీరి అభివృద్ధి కోసం ప్రభుత్వం గిరిజన సహకార సంస్థ మాత్రమే కాకుండా ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా వీరికి ఆర్థిక సహాయం, ఇతరత్రా సహాయ సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇంకా వీరికి ప్రభుత్వం ఉచితంగానో, అప్పు రూపంగానో ఆటోరిక్షాలు, జీప్‌లు, ట్రాక్టర్లు మొదలైన వాహనాలను సమకూరుస్తోంది. చదువుకున్న వారికి ఉద్యోగాలు, చదువులేని వారికి ఉపాధులు కల్పిస్తూ ప్రభుత్వం ఎంతో సేవ చేస్తోంది. ఇంత సేవ చేస్తున్నప్పటికీ, ప్రభుత్వం నుండి ఎన్నో ఉపాధి పథకాలు పొందినప్పటికీ వీరిలో ఇంకా ఆశించినంత ప్రగతి కనబడడం లేదని, వీరికి అందించే నిధులు చాలావరకు దుర్వినియోగమవుతున్నాయని కూడా విమర్శలు వస్తున్నాయి.
చెంచులు చాలావరకు ఆధునిక అభివృద్ధి సౌకర్యాలకు అనుకూలంగా జనజీవన స్రవంతిలో కలిసిపోయి వారి జీవన సరళిలో మార్పు వచ్చినప్పటికీ ఇంకా చాలామంది అడవుల్లోనే గోచీ రాయుళ్లుగా ఉంటూ ఆ ఎల్లలు దాటి గ్రామీణ జనజీవనంలో కలియలేకపోతున్నారు. వారికోసం ఎన్నో పథకాలు చేపట్టి వారి దగ్గరకే ప్రభుత్వాధికారులు వెళ్లి అనేక రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ఆశించినంత ఫలితాలు రావడంలేదు. చెంచుల అభివృద్ధి కోసం జిల్లా కేంద్రంలోని జిల్లా గిరిజన సంక్షేమ కార్యాలయాలను సైతం మన్నానూర్ గ్రామంలో ఏర్పాటు చేసి వారికి ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇదిగాక ఐటిడిఏ (ఇంటిగ్రేటెడ్ ట్రైబల్స్ డెవలప్‌మెంట్ అథారిటీ) ప్రాజెక్టు ఆఫీసును సైతం మన్నానూర్ గ్రామంలో ఏర్పాటు చేసి వీరి బాగోగులను చూస్తోంది. గిరిజన సహకార సంస్థ బ్రాంచి ఆఫీసును మన్నానూర్ గ్రామంలో ఏర్పాటు చేసి వీరికి కావలసిన నిత్యావసర సరకులు పంపిణీ చేస్తుంది. వీరు అడవుల నుండి సేకరించుకొని తెచ్చిన అటవీ ఉత్పత్తి వస్తువులను తీసుకుంటూ వారి సంక్షేమానికి అహర్నిశలు పాటుపడుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలోని సుండిపెంటలో ప్రత్యేకంగా చెంచులకోసం ఐటిడిఏ ప్రాజెక్టు ఆఫీసును స్థాపించింది. దీని ద్వారా నల్లమల అడవుల్లోని చెంచులందరికీ అనగా మహబూబ్‌నగర్, ప్రకాశం, గుంటూరు, నల్గొండ మొదలైన జిల్లాల పరిధిలోని చెంచు కుటుంబాలకు ఈ ప్రాజెక్టు కార్యాలయం నుండి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కొంతమంది చెంచులు ప్రభుత్వం ద్వారా లబ్ధిపొందిన భూములతో వ్యవసాయం చేస్తూ పాడిపశువులను, ఎద్దులను, ఆవులను, మేకలను మొదలైనవాటిని పోషిస్తూ అభివృద్ధి పథంలో నడుస్తున్నారు.
-దరెగోని శ్రీశైలం
No comments:
Post a Comment