
దుర్భర జీవితాలు గడుపుతున్న చెంచులు
మౌలిక సదుపాయాలు కూడా అందని వైనం-కనీస రక్షణ కరువు
మహబూబ్‌నగర్‌టౌన్ (వి.వి) : జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో చెంచులు దుర్భర జీవితం గడుపుతున్నారు. ఎన్ని పథకాలు వచ్చినా వారికి మాత్రం సరైన ప్రయోజనాలు అందడం లేదు. కనీస సౌకర్యాలు కూడా పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు. రక్షణ కూడా కరువైన పరిస్థితుల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. అసలే అటవీ ప్రాంతం...విషపూరితమైన క్రిమికీటకాలు...క్రూరమృగాలతో సహజీవనం. నివాసం గుడారా లలో....ఇలాంటి స్థితిలో వారికి కనీస రక్షణ కూడా లేదు. మహబూబ్‌నగర్ జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో వివిధ చోట్ల సుమారు 20 వేల వరకు జనాభా వున్నట్లు ప్రభుత్వం అంచనా. వీరికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించి మెరుగైన జీవనం సాగించేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. వివిధ శాఖల ద్వారా ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తోంది. వాటి ఫలితాలు మాత్రం చెంచులకు అందడం లేదు. ప్రభుత్వం చెబుతున్నవేమీ తమకు దక్కడం లేదని చెంచువాసులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, ఇతర శాఖల అధికారులు మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎప్పటికప్పుడు చెబుతున్నప్పటికీ ఎక్కడ అది ఆచరణకు నోచుకోవడంలేదనే విషయం వారి జీవన పరిస్థితులను పరిశీలిస్తే అర్థమవుతుంది. జిల్లాలోని లింగాల మండలం ఎర్రపెంటను పరిశీలించ గా...ఇక్కడి ప్రజలు దుర్భర పరిస్థితుల మధ్య తమ జీవనం సాగిస్తున్నారు. తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు మౌలిక సదుపాయాలను కల్పించడంలో ఈ ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. తమకు వుండేందుకు ఇళ్ళు కూడా లేవని, గుడారాలల్లో జీవనం సాగిస్తున్న తమను పట్టించుకునే నాథుడు కరువయ్యాడని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి ఇక్కడి ప్రజాప్రతినిధులు కేవలం ఓట్ల సమయంలో వస్తున్నారు తప్ప గెలిచిన తరువాత ఎవ్వరూ తమ గ్రామాల వైపు కన్నెత్తి కూడా చూడడంలేదని వారు అంటున్నారు. చెంచుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన మాడా, ఐటిడిఎ శాఖల అధికారులు కూడా తమను పట్టించుకోవడం లేదని, వారు ఎవ్వరూ కూడా గ్రామాలను సందర్శించిన దాఖలాలు లేవని తెలిపారు. ముఖ్యంగా ఐటిడిఎ, మాడా శాఖల ద్వారా చెంచుల అభివృద్ధి కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతున్నారు. వీటివల్ల చెంచులకు ఒరిగేది శూన్యమనే చెప్పాలి. ముఖ్యంగా ఇక్కడి చెంచులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వారికి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడంతో పాటు వారికి కావాల్సిన కనీస మౌలిక సదుపాయాలు, ఇళ్ల నిర్మాణం వంటి వాటిపై దృష్టి సారించాల్సిన ఈ శాఖలు తమ బాధ్యతను పూర్తిగా విస్మరించాయి. ప్రభుత్వం తమకు పక్కా ఇళ్ళు నిర్మిస్తుందని ప్రకటిస్తున్నా వాస్తవాలు మాత్రం అందుకు విరుద్దంగా వున్నాయని, ఆధికారులను కలిసి తమకు ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని కోరితే మీరు సగం ఖర్చు పెడితే మిగితాది ప్రభుత్వం భరిస్తుందని సమాధానం ఇస్తున్నారని, తాము అంత సొమ్మును పెట్టే పరిస్థితి ఉంటే ఇక్కడ ఎందుకు జీవనం సాగిస్తామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ ఇక్కడ ఎలాంటి ఇళ్ళు మంజూరు చేయలేదని, 20 సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రభుత్వం కట్టిన ఇళ్ళు కొన్ని కూలిపోగా, మరికొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయని చెంచులు తెలిపారు. ఇక్కడ ఉండే వాతావరణ పరిస్థితుల కారణంగా వివిధ రకాల వ్యాధుల బారినపడి 40 ఏళ్ళకు మించి ఎవ్వరూ బ్రతకడం లేదని, 50ఏళ్ళలోపే మృత్యువాత పడుతున్నారని వారు తెలియచేశారు. జిల్లా వైద్యశాఖ అధికారులు ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించకపోడం, వైద్యులు ఎవ్వరు కూడా ఇక్కడికి రాకపోవడం వల్ల తాము వ్యాధులతో బాధపడుతున్నామని చెప్పారు. ఇక్కడి పిల్లలకు కనీస విద్యను అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
ఇక్కడ గతంలో ఏర్పాటు చేసిన పాఠశాల ఏనాడు తెరుచుకున్న దాఖలాలు కూడా లేవు. అంగన్‌వాడి కేంద్రం సైతం శిథిలావస్థకు చేరుకుందని, ఇక్కడ నియమించిన ఉపాధ్యాయులు, అంగన్‌వాడి కార్యకర్తలు ఎవ్వరు కూడా ఈ ప్రాంతాలకు రారని వారు చెప్పారు. మరి ఇక్కడ పనిచేయాల్సిన ఉపాధ్యాయులు ఎక్కడ పనిచేస్తున్నారు, ఇక్కడ పిల్లలకు కేటాయించే అంగన్‌వాడి సరుకులు ఎక్కడికి పోతున్నాయనే విషయంపై అధికారులే సమాధానం చెప్పాల్సిన అవసరం వుంది. మొత్తం మీద ఇక్కడి చెంచులు అభివృద్ధికి అమడ దూరంలో...కటిక దారిద్య్రంలో నివసిస్తున్నారు.
No comments:
Post a Comment